Home > Featured > నేటి నుంచి మునగోడులో కాంగ్రెస్ ప్రచార పర్వం

నేటి నుంచి మునగోడులో కాంగ్రెస్ ప్రచార పర్వం

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ తర్వాత రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ ను వీడి బీజేపీలో చేరటంతో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో కాంగ్రెస్‌ కు అడ్డాగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో.. కలవరం మొదలైంది. ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు ఇప్పటికే పావులు కదుపుతున్నాయి. రాజగోపాల్‌ రెడ్డి తనకున్న పలుకుబడితో బీజేపీ నుంచి గెలిచి మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. దీంతో అధికార పార్టీ కూడా మునుగోడులో సత్తా చాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు, సభలతో బలప్రదర్శన చేస్తుంటే, కాంగ్రెస్‌ మాత్రం ఆచీతూచీ అడుగులు ముందుకు వేస్తోంది.

నేటి నుంచి మునుగోడు ఉప ఎన్నిక ప్రచార బరిలోకి దిగనుంది కాంగ్రెస్. గడప గడపకు కాంగ్రెస్‌ అనే నినాదంతో మండలాల వారీగా ఇన్‌ఛార్జ్‌లు ఈ ప్రచారంలో పాల్గొంటారు. ఈ నెల ఆరో తేదీ వరకు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ మీ మునుగోడు - మీ కాంగ్రెస్‌ అనే నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలని పీసీసీ నిర్ణయించింది. ఇప్పటికే రాజీవ్‌గాంధీ జయంతి రోజున పొర్లగడ్డ తండాలో పార్టీ పతాకాన్ని ఎగురవేసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఎన్నికలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను దీటుగా ఎదుర్కోవాలని పీసీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా మండల ఇన్‌ఛార్జీలను నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

ప్రధానంగా రాజగోపాల్‌ రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడారని, ఆర్థిక ఒప్పందంలో భాగంగానే బీజేపీలో చేరారని జనంలోకి తీసుకెళ్లాలని పీసీసీ తెలిపింది. మండలాలు, పంచాయతీల వారీగా బీజేపీ, టీఆర్ఎస్ చేరిన నేతలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించడం ద్వారా ఆయా పార్టీలపై వ్యతిరేకత పెంచాలని నిర్ణయించింది.

Updated : 31 Aug 2022 10:34 PM GMT
Tags:    
Next Story
Share it
Top