మార్ఫింగ్ ఫోటోతో నన్ను ఓడించారు.. పాల్వాయి స్రవంతి ఆవేదన - MicTv.in - Telugu News
mictv telugu

మార్ఫింగ్ ఫోటోతో నన్ను ఓడించారు.. పాల్వాయి స్రవంతి ఆవేదన

November 7, 2022

మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పదివేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. రెండో స్థానంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి నిలిచారు. మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి రెడ్డి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. అయితే ఓటమిపై ఆదివారం మాట్లాడని స్రవంతి.. సోమవారం తన సొంతూరు చండూరు మండలం ఇడికుడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన ఓటమికి గల కారణాలను మీడియాకు తెలియజేశారు.

‘టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ తప్పుడు అంశాలతో ప్రచారం సాగించారు. నేను సీఎం కేసీఆర్‌ను కలవకపోయినా కలిసినట్టు మార్ఫింగ్ ఫోటో సృష్టించి విరివిగా ప్రచారం చేశారు. దాంతో నా ఎన్నికల ప్రచారంపైనా, నాకు పడే ఓట్లపైనా తీవ్ర ప్రభావం చూపింది. నా ఓటమికి ఈ ఫోటో ముఖ్య కారణం. రెండు పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశాయి. బీజేపీ కోవర్టు రాజకీయాలు చేసింది. చివరకు కల్తీ మద్యం పంపిణీ చేసి ప్రజల అనారోగ్యానికి కారణమైంది. కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా కోవర్టు రాజకీయాలు చేశారు. నాకు ద్రోహం చేసిన ఆయనపై చర్యలు ఉంటాయో లేదో అధిష్టానం నిర్ణయిస్తుంది. అసలు ఈ ఉప ఎన్నిక ప్రజల కోసం జరగలేదు. ఈసీ కూడా తన విధుల నిర్వహణలో ఫెయిలైంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.