ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరుగుతున్న 85వ ఏఐసీసీ ప్లీనరీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అర్థం వచ్చేలా సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశాయి. దీంతో జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ స్పందించి…సోనియా గాంధీ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చింది. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం మాత్రమే తనకు ఆనందంగా ఉందన్నట్లు సోనియా చెప్పారని చత్తీస్‌గఢ్ వ్యవహారా ఇంచార్జీ కుమారిస్టెల్లా తెలిపారు. తాను రాజకీయాలకు దూరం అవుతున్నట్లు సోనియా గాంధీ ఎక్కడా ప్రస్తావించలేదని ఆమె వివరించారు. రాజకీయాల నుంచి తప్పుకునే ఉద్దేశ్యం సోనియా గాంధీకి లేదని స్పష్టం చేశారు.
అంతకుముందు సోనియాగాంధీ మాట్లాడుతూ..దీనిలో భారత్ జోడో యాత్రను పార్టీకి ఒక మేలి మలుపని సోనియా వ్యాఖ్యానించారు. అంతేకాదు భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తుండడం చాలా సంతోషం కలిగిస్తోందని కూడా అన్నారు. దేశాన్ని ఒక మలుపు తిప్పిన యాత్ర ఇది. సామరస్యం, సహన్, సమానత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసిందని అన్నారు. యాత్రను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఇటువంటి యాత్రతో తన రాజకీయ జీవితానికి ముగింపు పలకడం ఆనందాన్నిచ్చిందని సోనియాగాంధీ చెప్పారు.