Congress General Secretary, MP Jairam Ramesh letter to BJP National President JP Nadda
mictv telugu

‘సోనియా గురించి ఇంకోసారి అలా మాట్లాడితే’.. బీజేపీకి కాంగ్రెస్ వార్నింగ్

July 24, 2022

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై బీజేపీ నేత ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌. బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా.. శనివారం ఓ జాతీయ ఛానల్‌లో మాట్లాడుతూ సోనియా గాంధీపై పరుషపదజాలన్ని ఉపయోగించడంపై మండిపడ్డారు. మరోసారి ఇలా మాట్లాడితే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈమేరకు జైరాం రమేశ్.. జేపీ నడ్డాకు లేఖ రాశారు.

సంస్కృతి సంప్రదాయాల గురించి పదే పదే మాట్లాడే బీజేపీ అధికార ప్రతినిధులు, ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలైన 75 ఏళ్ల సోనియా గాంధీ గురించి అభ్యంతరకరంగా మాట్లాడారని జైరాం రమేశ్ ఆరోపించారు. ఆ పార్టీ మహిళలకు వ్యతిరేకం అనేందుకు ఇదే నిదర్శనమన్నారు. ఇలాంటి మాటలవల్ల దేశంలో రాజకీయాలు దిగుజారుతున్నాయని ధ్వజమెత్తారు. మోదీ సహా ఎంతో మంది బీజేపీ నేతలు మహిళల పట్ల పలుమార్లు అగౌరవంగా మాట్లాడిన విషయం దేశం మొత్తానికి తెలుసన్నారు.

దేశంలో మహిళల్ని గౌరవించడం వేద కాలం నుంచి అనుసరిస్తున్న గొప్ప సంప్రదాయమని.. రాజకీయాల్లో మర్యాద, మహిళల పట్ల గౌరవ ప్రవర్తన బీజేపీ నుంచి ఆశించడం సహజమేనన్నారు. కానీ ఆ పార్టీ ప్రతినిధులు వాడుతున్న భాష, ప్రవర్తన తమను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. బీజేపీ నేతలు మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని, రాజకీయ గౌరవాన్ని దెబ్బతీయొద్దని కోరారు.