బీజేపీకి అనుకూలమని బాలకృష్ణకు నంది అవార్డు ఇవ్వలేదు - నిర్మాత
టాలీవుడ్ నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్ సహజనటి జయసుధపై మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జయసుధ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నటిగా మారి 50 ఏళ్లయినా తననెవరూ పలకరించలేదని, హీరోయిన్ల విషయంలో చిన్న చూపు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో నిర్మాత జయసుధను మెచ్చుకుంటూనే చురకలంటించారు. ఈ క్రమంలో బాలయ్యబాబు ప్రస్తావన తీసుకొచ్చారు. ‘జయసుధ సినీ పరిశ్రమకు చెందినవారు. ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేశారు. అప్పుడు రాష్ట్రం, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో బాలకృష్ణకు శ్రీరామరాజ్యం సినిమాలో నటనకు గాను బెస్ట్ యాక్టర్‌గా నంది అవార్డు వచ్చింది. కానీ, శ్రీరాముడు బీజేపీ, ఆరెస్సెస్‌కు సంబంధించిన వ్యక్తి అని ఆ అవార్డును మరో హీరోకు ఇచ్చారు. జాతీయ అవార్డు విషయంలోనూ ఇదే విధానం పాటించారు. బాలయ్య నవరసాలను అద్భుతంగా పలకించారు. దాంతో అవార్డు ఇవ్వాలని జ్యూరీ కూడా నిర్ణయించింది. కానీ ఇవ్వలేదు. రెండు ప్రభుత్వాలు రాముడు అనే అంశాన్ని చూసి అవార్డును పక్కన పెట్టారు. ఇది తప్పుకదా. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న జయసుధ ఈ విషయంలో నిలదీసి అసెంబ్లీలో మాట్లాడి ఉంటే బాగుండేది. కానీ ప్రశ్నించకుండా మౌనంగా ఉండిపోయారు’ అని వ్యాఖ్యానించారు. అటు జయసుధ పద్మశ్రీ అవార్డుకు అర్హురాలు అని ముగించారు ప్రసన్నకుమార్. కాగా, ఈ అంశం ఇప్పుడు బాలయ్య అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయాలకు, కళాకారులకు, ముఖ్యంగా శ్రీరాముడుకి సంబంధం ఏంటని మండిపడుతున్నారు.