మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ మరోసారి తన నోటి దూలను ప్రదర్శించుకున్నాడు. బీజేపీ దళిత మహిళా మంత్రిని ఐటమ్ అన్నాడు. దీంతో బీజేపీ శ్రేణులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మధ్య ప్రదేశ్‌లో ప్రస్తుతం కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్వాలియర్ జిల్లా దబ్రా అసెంబ్లీ స్థానంలో ప్రచారం చేయడానికి కమల్ నాథ్ వెళ్లారు.
ఆ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఇమార్తి దేవిని ఆయన ఐటమ్‌గా అభివర్ణించారు. కమల్ నాథ్ సభలో మాట్లాడుతూ.. ‘మన అభ్యర్థి ఎంతో నిరాడంబరమైన వ్యక్తి. ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న ఆమెతో పోల్చితే మన అభ్యర్థి ఎంతో మేలు. ఇంతకీ ఆమె పేరేంటి? అయినా నేను ఆమె పేరు ఎందుకు పలకాలి? ఏం ఐటమ్ అబ్బా… ఏం ఐటమ్’ అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ వర్గాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఓ దళిత అభ్యర్థిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కమల్ నాథ్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. బీజేపీతో పాటు దళిత సంఘాలు కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.