అధికారంలో ఉన్న ప్రభుత్వంపై కానీ, నాయకులపై కానీ విమర్శలు చేయాలంటే కాస్త ఆలోచించే పరిస్థితి వచ్చింది ప్రతిపక్షాలకు. ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలని, ఎక్కువగా ప్రసంగిస్తే కేసు నమోదో లేదంటే అనర్హత వేటుకి గురవ్వక తప్పదనే సంకేతాలు ప్రజల్లోకి వెళుతున్నాయి. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలోనూ అదే పరిస్థితి. ఈ మధ్య తెలంగాణలో టీఎస్పీఎస్సీ వ్యవహారం ఎంత చర్చనీయాంశమైందో అందరికీ తెలిసిందే. తమకో అవకాశం దొరికిందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై రెచ్చిపోయి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి ఏవేవో వ్యాఖ్యలు చేశారని, ఆయనపై కేసు నమోదైంది.
మంత్రి గారి ప్రతిష్ట దెబ్బతిన్నది
నిర్మల్ మున్సిపాలిటీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 42 ఉద్యోగాలు అమ్ముకున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేశారని ఆ కేసు సారాంశం. ఎలాంటి ఆధారాలు లేకుండా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రతిష్ట దెబ్బతినేలా మహేశ్వర్ రెడ్డి ఈ నెల 21న వ్యాఖ్యలు చేశారంటూ నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు కొందరు. మహేశ్వర్ రెడ్డిపై 117/23, 153, 504, 505(2) సెక్షన్ల కింద పోలీసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా మహేశ్వర్ రెడ్డికి CRPC 91/160 కింద నోటీసులు జారీ చేశారు. అయితే మహేశ్వర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో పోలీసులు ఆయన ఇంటికి నోటీసులు అంటించారు.
మంత్రి పదవికి అనర్హుడు
పరీక్ష పేపర్లు లీక్ అవ్వడం చాలా సాధారణం అంటూ టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌ను ఉద్దేశించి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కామెంట్ చేయడం ఎంత పెద్ద రచ్చకు దారితీసిందో అందరికీ తెలిసిందే. అయితే మంత్రి వ్యాఖ్యలను మహేశ్వర్ రెడ్డి తప్పుబడుతూ.. మంత్రి పదవిలో ఉండటానికి ఇంద్రకరణ్ రెడ్డి అనర్హుడు అంటూ విమర్శించారు. ఇప్పుడు కేసుల వరకూ వెళ్లడంతో పోలీసులు ఇచ్చిన నోటీసుకు మహేశ్వర్ రెడ్డి ఎలా స్పందిస్తారు? పోలీసుల యాక్షన్ ఏంటి? బీఆర్‌ఎస్ రియాక్షన్ ఏంటి? కాంగ్రెస్ కౌంటర్ ఏంటి? అన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.