Congress leader Rahul Gandhi slams trs pledges form government in Telangana
mictv telugu

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. రాహుల్

May 6, 2022

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను కాలరాస్తోందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ రోజు వరంగల్‌లో ఏర్పాటు చేసిన ‘రైతు సంఘర్షణ సభ’లో ఆయన కేంద్రంలోని మోదీ సర్కారుతోపాటు, కేసీఆర్ ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజా వ్యతిరేకమైన టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందముందని, వాటిని నమ్మితే నట్టేట మునిగినట్టేనని హెచ్చరించారు. తెలంగాణలో ఒంటిచేత్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి బీజేపీకి లేదని, అందుకే ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా టీఆర్ఎస్‌తో పని చేయిస్తూ అనుకున్నవి నెరవేర్చుకుంటోందని ఆరోపించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అవినీతికి పాల్పడుతున్నా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని సులభంగానే అర్థం చేసుకోవచ్చని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులు, నిరుద్యోగులు అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామన్నారు. సభకు ముందు ఆయన ట్విటర్లోనూ మోదీ సర్కారుపై విమర్శలు సంధించారు. మోదీ సర్కారు ఎల్ఐసీని కారుచౌకగా ప్రైవేట్ పరం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల ఆస్తులు ఉన్న ఈ సంస్థను అమ్మేస్తున్నారని మండిపడుతూ గురువారం ట్వీట్ చేశారు. ఎల్ఐసీ 13.94 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని, 30 కోట్ల మంది పాలసీ హోల్డర్లు ఉన్నారని ట్వీట్ లో తెలిపారు. రూ.39 లక్షల కోట్ల ఆస్తులున్న ఈ సంస్థ.. షేర్ హోల్డర్లకు పెట్టుబడులపై రాబడిని ఇవ్వడంలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉందని తెలిపారు. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం ఈ సంస్థ విలువను అతి తక్కువగా అంచనా వేసి, కారుచౌకగా అమ్మేస్తుందని ఆరోపించారు. ఎల్ఐసీలో తనకుగల 3.5 శాతం వాటాను అమ్మేసి రూ.21,000 ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.