ఏపీ రాజకీయాల్లో వేలు పెడుతూ ఈ మధ్య వైసీపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి మరోసారి సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. పార్టీ ఆవకాశమిస్తే తాను ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. విజయవాడ వచ్చిన సందర్భంగా ఆమె కాసేపు మీడియాతో మాట్లాడారు. ఏపీలో తాను ఎక్కడైనా తిరుగుతానని… తనను ఎవరు ఆపుతారో చూస్తానంటూ సవాల్ విసిరారు.
జగన్ పరిపాలనో ప్రజలు నరకం అనుభవిస్తున్నారని రేణుకా చౌదరి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సర్కార్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ శాంతియుతంగా నిరసనలు, పాదయాత్రలు చేస్తున్న రైతుల, మహిళల సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బంగారంలాంటి రాష్ట్రాన్ని సీఎం జగన్ అప్పులపాలు చేశారని రేణుకాచౌదరి ఆరోపించారు. ఏమైనా మాట్లాడితే కులాల పేరుతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ పాలనపై కూడా విమర్శలు చేశారు ఆమె. పార్టీ పేరులో తెలంగాణ అనేదే లేకుండా చేసిన కేసీఆర్… ఆయన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారంటూ ధ్వజమెత్తారు.