విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటన టీ కాంగ్రెస్‌లో రచ్చకు కారణమైంది. ఆయనతో సమావేశమయ్యే విషయంలో టీ కాంగ్రెస్‌లో విభేదాలు వెలుగుచూశాయి. యశ్వంత్ సిన్హా తెలంగాణకు వస్తే సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ లీడర్లు మినహా.. జాతీయ స్థాయిలో మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ స్వాగతం పలకకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు. యశ్వంత్ సిన్హాను ఎందుకు కలవరని పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధిష్టానం తో మాట్లాడి సీఎల్పీ కి ఆహ్వానించేది ఉండాల్సిందని.. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
అయితే యశ్వంత్ సిన్హా తమకంటే ముందుగా టీఆర్ఎస్ నేతలతో భేటీ అవుతున్నందున హైదరాబాద్‌లో ఆయనను కలవబోమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం ప్రకటించారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాగా నిర్ణయించింది మమతా బెనర్జీ, శరద్ పవార్లు కానీ.. కాంగ్రెస్ కాదని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే దీనిని పలువురు నాయకులు వ్యతిరేకించారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ యశ్వంత్ సిన్హాకు బహిరంగంగా మద్దతు ఇచ్చిందని టీ కాంగ్రెస్ నేతలు అన్నారు. ఆయన నామినేషన్ దాఖలు చేసినప్పుడు రాహుల్ గాంధీ కూడా అతనితో చేరారని చెప్పారు. దీంతో యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటన.. టీ కాంగ్రెస్‌లో గొడవకు కారణమైంది. నేడు హైదరాబాద్‌కు వచ్చిన యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ బేగంపేట ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇక హైదరాబాద్ లో మోడీ పర్యటన నేపథ్యంలో.. బీజేపీ డ్రామా పార్టీ అయిపోయిందన్నారు జగ్గారెడ్డి. మళ్లీ భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్తామంటున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అమ్మవారి గుడికి తాను కూడా వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గుడిలో భజన చేస్తానంటూ జగ్గారెడ్డి తెలిపారు. అగ్నిపథ్‌లో నాలుగేళ్లే ఉద్యోగం అని చెబుతోందని ఆయన మండిపడ్డారు. బీజేపీ నేతలకు జ్ఞానోదయం కలిగించమని అమ్మవారిని ప్రార్ధిస్తామని జగ్గారెడ్డి చురకలు వేశారు. అలాగే మంచి పాలన అందించేలా బీజేపీ నేతలకు బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటానని ఆయన పేర్కొన్నారు.