Congress leaders bloked Minister Malla Reddy's padayatra in Secunderabad,
mictv telugu

మంత్రి మల్లారెడ్డి పాదయాత్రలో ఉద్రిక్తత..

November 20, 2022

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేస్తోన్న పాదయాత్రను కొందరు కాంగ్రెస్ నేతలు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. హామీలు నెరవేర్చేవరకు పాదయాత్ర ముందుకు సాగనివ్వమని హెచ్చరించారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌లోని గబ్బిలాల్‌ పేట ప్రాంతంలో పాదయాత్ర కొనసాగుతుండగా.. కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. జవహర్‌నగర్ ప్రాంతంలో సమస్యలను పరిష్కరిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి.. ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జవహర్‌నగర్‌లో జీవో నెంబర్ 58, 59 అమలు, 50 పడకల ఆసుపత్రి విషయంలో మంత్రి మల్లారెడ్డి హామీలకే పరిమితమయ్యారని వారు దుయ్యబట్టారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం కాస్త తోపులాటకు దారి తీసింది. దీంతో గబ్బిలాల్‌పేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు ఇరు వర్గాలు వారిని చెదరదీయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మంత్రి మల్లారెడ్డి జవహర్‌నగర్‌ ప్రాంతంలో నెలకొన్న సమస్యల విషయంలో పరిష్కారం చూపాలని లేని పక్షంలో పెద్ద ఉద్యమం చేపడతామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.