సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌తో గురువారం భేటీ అయ్యారు. దీంతో కాంగ్రెస్‌లో కలకలం రేగింది. ముందుగా అసెంబ్లీ హాల్‌లో సీఎంని కలిసి అపాయింట్‌మెంట్ కోరగా, ఛాంబర్‌లోకి వెళ్లిన తర్వాత పిలిచారు. మీటింగ్ అనంతరం బయటికి వచ్చి సీఎంకి చెప్పిన వివరాలను తెలియజేశారు. సంగారెడ్డి వరకు మెట్రో రైలు పొడిగింపు, నియోజకవర్గంలో 500 మందికి దళిత బంధు, మహబూబ్ సాగర్ అభివృద్ధి, సంగారెడ్డిలో చెరువుల అభివృద్ధికి నిధుల కేటాయింపు, సదాశివపేట, కొండాపూర్‌లలో 5 వేల మందికి ఇళ్ల స్థలాల కేటాయింపులతో కూడిన వినతి పత్రాన్ని కేసీఆర్‌కి ఇచ్చినట్టు తెలిపారు. వాటి అమలుకు ఆధికారులకు ఆదేశాలు ఇచ్చారని, మరోసారి అపాయింట్ మెంట్ ఇస్తే ప్రగతి భవన్‌కి వెళ్లి కలుస్తానన్నారు. ఈ భేటీపై కొందరు కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించగా, ఇందులో తప్పేముందని తిరిగి ప్రశ్నించారు. ప్రధాని మోదీని కాంగ్రెస్ ఎంపీలు నేరుగా కొందరు, చాటుగా కొందరు కలుస్తున్నారని తెలిపారు. అక్కడ లేని ఇబ్బంది ఇక్కడ ఎందుకు వస్తోందని అన్నారు. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న రెండు రోజులకే తనపై కోవర్టు ముద్ర వేశారని, అంతకంటే బద్నాం ఏముంటందని అభిప్రాయపడ్డారు.