రేపు సంచలన ప్రకటన చేస్తా.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

రేపు సంచలన ప్రకటన చేస్తా.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి

July 3, 2022

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరింత ముదిరాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరుతో విసిగిపోయిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి… గతంలోనే పార్టీని విడిచి వెళ్లేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే రాహుల్‌గాంధీ మాటకు కట్టుబడి కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తాజాగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటనలో పార్టీలో మళ్లీ చిచ్చు రేపింది. యశ్వంత్‌ సిన్హా పర్యటనను టీఆర్ఎస్ పార్టీ హైజాక్ చేసిన నేపథ్యంలోనే ఆయన్ని కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ నేరుగా కలవడానికి వీల్లేదని రేవంత్ ఆదేశించారు. పార్టీ అధిష్ఠానం మేరకు రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాకు ఓటేస్తామని.. కానీ ఆయన్ని నేరుగా మాత్రం కలిసేది లేదని స్పష్టం చేశారు.

జాతీయ నాయకత్వంతో మాట్లాడే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘దీన్ని పార్టీ నేతలెవరైనా అతిక్రమిస్తే చూస్తూ ఊరుకోం.. తీసి గోడకేసి కొడతాం’ అని వ్యాఖ్యానించారు. తమను అవమానపరిచేలా రేవంత్‌ మాట్లాడుతున్నారని.. అలా రెచ్చగొట్టడం వల్లే తాను మీడియా ముందు మాట్లాడానన్నారు. రాజకీయ యుద్ధం చేయాలంటే వ్యూహం ఉండాలన్నారు. పార్టీ వ్యవహారాలు బయటపెట్టనని రాహుల్‌గాంధీకి ఇచ్చిన మాట తప్పినందుకు ఆయనకు క్షమాపణలు చెబుతున్నా’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మళ్లీ జగ్గారెడ్డి స్పందిస్తూ రేపు ఓ సంచలన ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు.