కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా.. హైకమాండ్‌కు లేఖ - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా.. హైకమాండ్‌కు లేఖ

March 13, 2018

అసెంబ్లీ, శాసన మండలిలలో తమపై చర్యలు తీసుకోవడంపై కాంగ్రెస్ ప్రజాప్రతిధులు భగ్గుమన్నారు. కోమటి రెడ్డి, సంపత్ కుమార్‌ల సభ్యత్వాలను స్పీకర్ రద్దు చేయడం అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్‌లకు నిరసనగా తమ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడి రాజీనామా చేస్తారని సీఎల్పీ నేత జానారెడ్డి ప్రకటించారు. రాజీనామా చేస్తామని, అందుకు అనుమతివ్వాలని తమ అధిష్టానానికి లేఖ రాశామని ఆయన తెలిపారు.‘కేసీఆర్ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోంది. ఏ నిబంధన కింద మా సభ్యుల సభ్యత్వాలను రద్దు చేశారు?  మేం ఏ నేరం చేశామని సస్పెండ్ చేశారు? మా నుంచి కనీస వివరణ తీసుకోకుండా ఇంతతీవ్ర నిర్ణయం తీసుకోవడం సరైందేనా? ఇక మీతో మాట్లాడాల్సిన పని లేదు. ప్రజాక్షేత్రంలోనే అమీతుమీ తేల్చుకుంటాం..’ అని జానా రెడ్డి తేల్చి చెప్పారు. సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్ ల తర్వాత సీఎల్పీ ఆఫీసులో అత్యవసరంగా సమావేశం జరిగింది. అందరం మూకుమ్మడిగా రాజీనామా చేద్దామని ప్రతిపాదించారు. అధిష్టానం నుంచి అనుమతి రాగానే రాజీనామాలను స్పీకర్ కు సమర్పించాలని నిర్ణయించారు.