కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధురి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అధిర్ రంజన్ చౌధురి వ్యాఖ్యలపై మండిపడుతూ, గురువారం పార్లమెంటు ఆవరణలో బీజేపీ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
భారతదేశ 15వ రాష్ట్రపతి ఇటీవలే ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇంతలోనే ఆమెపై కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభ సభ్యుడు అధిర్ రంజన్ చౌధురి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ద్రౌపది ముర్మును ఆయన ‘రాష్ట్రపత్ని’ అని సంబోధించారు. దీంతో బీజేపీ శ్రేణులు ఆయన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన మహిళను కించపరిచేందుకు కూడా తన పార్టీ నేతలకు సోనియాగాంధీ అవకాశం ఇచ్చారని స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్మృతి ఇరానీ మీడియాతో మాట్లాడుతూ..”సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ, ఆదివాసీ వ్యతిరేకి, దళిత వ్యతిరేకి, మహిళా వ్యతిరేకి. సోనియా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న మహిళలను కించపరచడం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ పార్లమెంటులోనే కాకుండా దేశంలోని వీధుల్లో కూడా క్షమాపణ చెప్పాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరపున ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ఎంపిక చేసినప్పటి నుంచి ఆమెను కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత కూడా ఆమెపై దాడి ఆగలేదు” అని అన్నారు.