Congress party is working on Munugode by-election candidates
mictv telugu

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి?

August 11, 2022

మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు చేస్తోంది. ప్రత్యర్థి పార్టీల ఎత్తులు, వ్యూహాలను గమనిస్తూ పైఎత్తులు వేయాలనే ఆలోచనతో టీపీసీసీసీ నాయకత్వం ఆలోచన చేస్తోంది. సిట్టింగ్‌ సీటును ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదనే పట్టుదలతో కాంగ్రెస్ లీడ‌ర్లున్నారు. దానికి తగ్గట్టుగానే టికెట్‌ ఆశిస్తున్న వారి బలం.. బలహీనతలను బేరీజు వేసుకుని, అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీకి దీటుగా అభ్యర్థి ఉండేలా హస్తం నేతలు ప్లాన్‌ చేస్తున్నారు.

ఇక టికెట్‌ ఎవరికి ఇచ్చినా అధిష్టానం నిర్ణయం మేరకు అందరూ కలసికట్టుగా పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషిచేయాలని ఆశావహులకు పార్టీ స్పష్టం చేసింది. సిటింగ్‌ స్థానమైన మునుగోడును దక్కించుకోవడమే లక్ష్యంగా కీలక సమావేశాలను కాంగ్రెస్‌ ప్రారంభించింది. బుధవారం ఆ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్‌ ఆశావహులతో పాటు నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలతో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు సమావేశమై వివిధ అంశాలను చర్చించారు.

మరోవైపు పార్టీ ముఖ్యనేతలు బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు బోసురాజు, నదీమ్‌ జావేద్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు తదితరులు అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఆ ఉపఎన్నికపై ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ సర్వే వివరాలను అందించినట్లు సమాచారం .

ఇక‌.. సర్వే ఆధారంగానే టికెట్‌ కేటాయించాలనే యోచనలో ఉండ‌గా.. దీనికి కొంత‌మంది రాంరెడ్డి దామోద‌ర్‌రెడ్డిని ప్ర‌తిపాదించిన‌ట్టు తెలుస్తుందిది. పీసీసీ నుంచి వ‌చ్చిన ఈ ప్ర‌తిపాద‌న‌కు సీఎల్‌పీ కూడా ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం. అంతేకాకుండా సీనియ‌ర్ లీడ‌ర్ జానారెడ్డి, ఎంపీ, పీసీసీ మాజీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి కూడా స‌పోర్ట్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే క‌నుక ఫైన‌ల్ అయితే.. ఇత‌ర పార్టీల‌కు గ‌ట్టిపోటీ ఇస్తార‌న్న న‌మ్మ‌కం ఆ పార్టీ నేత‌ల్లో ఉంది.