రాష్ట్ర కాంగ్రెస్‌లోని సంక్షోభానికి తెరదించేందుకు ఢిల్లీ నుంచి వచ్చి ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. టీకాంగ్రెస్ నేతలను కాస్త గట్టిగానే మందలించారు. గాంధీభవన్ వేదికగా అసంతృప్తితో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలను ఆయన ఒక్కొక్కరిగా భేటీ అయ్యారు. పీసీసీ నిర్ణయాలు, సమస్యలను రాష్ట్ర నేతలు దిగ్విజయ్ దృష్టికి తీసుకెళ్లారు. గాంధీభవన్‌లో నాయకులతో విడివిడిగా చర్చలు జరిపిన దిగ్విజయ్ సింగ్.. పార్టీలో జూనియర్, సీనియర్ అనే పంచాయతీ మంచిది కాదని హితవు పలికారు. సమస్యలుంటే అధిష్ఠానం దృష్టికి తీసుకు రావాలే గానీ.. మీడియా ముందు మాట్లాడడం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడు ప్రశ్నల అజెండాతో తన వద్దకు వచ్చిన నేతల్ని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ను ఓడించడానికి మీ దగ్గర ఉన్న వ్యుహమేంటి? అని అడిగారు. పార్టీ బలోపేతానికి మీ పాత్రేంటి?.. ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. అంతర్గత సమస్యపై అభిప్రాయాలు చెప్పాలని కోరారు. ఎవరేం పని చేస్తున్నారో అధిష్ఠానం గమనిస్తుందని.. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే హైకమాండ్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సీనియర్లు, జూనియర్లు అంతా కలిసి పనిచేయాలని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. కాగా, దిగ్విజయ్ సింగ్ గాంధీ భవన్ లో ఉన్న సమయంలోనే పలువురు కాంగ్రెస్ నేతలు ఘర్షణ పడటం గమనార్హం. దీంతో దిగ్విజయ్ సింగ్ మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చింది ఇవి చూడటానికేనా? అని మండిపడ్డారు.