Congress party won 200 panchayats in Nagpur
mictv telugu

ఆర్ఎస్ఎస్ ఇలాకాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. మోదీ వచ్చినా తేడా లేదు

December 22, 2022

మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఎంతలా అంటే బీజేపీ కంచుకోట, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగ్ పూర్ లో క్లీన్ స్వీప్ చేసేంత. నాగ్ పూర్ పరిధిలో 236 పంచాయితీల్లో కాంగ్రెస్ 200 చోట్ల అసాధారణ విజయం సాధించింది. ఇందులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సొంత గ్రామం ఫెట్రీ కూడా ఉండడం గమనార్హం.

ప్రధాని మోదీ ఇటీవలే ఈ గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినా బీజేపీకి దారుణ ఫలితాలు రావడంతో ఆ పార్టీలో అంతర్మథనం మొదలైంది. ఈ పరిణామం దేనికి సంకేతమనే చర్చ నడుస్తోంది. దీన్ని రాజకీయ విశ్లేషకులు కూడా పరిశీలిస్తున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రభావం ఎన్నికలపై పడిందని అంచనా వేస్తున్నారు. అటు మహారాష్ట్ర రాజకీయాలను చూసి ప్రజలు విసిగిపోయి ఉన్నారని, శివసేన రెండుగా చీలిపోవడం, ఏక్ నాథ్ షిండే వర్గానికి బీజేపీ మద్ధతు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజకీయ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. కాగా, 7,582 గ్రామ పంచాయితీలకు డిసెంబర్ 18న ఎన్నికలు జరగ్గా బీజేపీ 2,482 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ 809, ఎన్సీపీ 1287 స్థానాల్లో గెలిచాయి. ఏక్ నాథ్ షిండే శివసేనకు 842 స్థానాలు, ఉద్దవ్ థాక్రే శివసేనకు 637 స్థానాల్లో విజయం సాధించాయి. కానీ, నాగ్ పూర్ లో ఓడిపోవడం ఆ పార్టీకి మింగుడు పడడం లేదు.