Congress party's dual stance on Marri Shashidhar Reddy, Komatireddy Venkat Reddy leaders
mictv telugu

మర్రి చేసిందేంటి? కోమటిరెడ్డి చేయనిదేంటి?

November 20, 2022

తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యవహారం, వారి పట్ల అధిష్టానం వైఖరి.. వేరే పార్టీలకు విమర్శనాస్త్రాలుగా మారాయి. ఓ వైపు పీసీపీ పదవిని సీనియర్లు అయిన తమని కాదని రేవంత్‌కు కట్టబెట్టడంపై ఇప్పటికీ కొందరు గొణుగుకుంటున్నా.. మరికొంతమంది బాహాటంగానే అధిష్టానంపై వ్యతిరేకత ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిలో జగ్గారెడ్డి, వి.హనుమంతరావు ప్రప్రథములు. ఈ విషయంపై ఇప్పటికే ఎన్నోసార్లు పార్టీకి రాజీనామా చేస్తానని, అధిష్టానాన్ని కలుస్తానాని మీడియా ముందు ప్రస్తావించారు జగ్గారెడ్డి. అయితే అవన్నీ జరగలేదు. ఇదిలా ఉండగా తాజా పరిణామాల ప్రకారం.. అసంతృప్త నేతల వ్యవహారంలో ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం మర్రి శశిధర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉదంతాలు.

బీజేపీ అగ్రనేత అమిత్‌ షాను కలిశారని, పార్టీపై విమర్శలు చేశారని పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డిపై ఆగమేఘాలపై చర్యలు తీసుకున్న అధిష్ఠానం అదే పని చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై మాత్రం చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నదని పార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా మూడు నెలల క్రితం అమిత్‌షాను కలిశారు. ఆయన పలుమార్లు పీసీసీ అధ్యక్షుడిని తిట్టిపోశారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సొంత పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రత్యర్థి పార్టీ నుంచి పోటీచేస్తున్న తమ్ముడికి ఓటు వేయాలని ఆయన కాంగ్రెస్‌ శ్రేణులను కోరిన ఆడియో వైరల్‌ అయింది. దీనిపై అధిష్ఠానం ఆయనకు నోటీసులు జారీచేసి చేతులు దులుపుకుంది. కాంగ్రెస్‌లోనే ఉంటూ పార్టీకి నష్టం కలిగించే రీతిలో వ్యవహరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వదిలేసి, కాంగ్రెస్ క్యాన్సర్ పట్టిందని వ్యాఖ్యలు చేసినందుకు మర్రి శశిధర్ రెడ్డిపై అధిష్టానం చర్యలు తీసుకోవడం సామాన్యుడిని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు కోమటిరెడ్డిపై చర్యలు తీసుకునేందుకు భయపడుతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.