Congress posted a photo of a burning RSS knicker
mictv telugu

కాలిపోతున్న ఆరెస్సెస్ నిక్కర్.. దుమారం రేపిన కాంగ్రెస్

September 12, 2022

భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పాదయాత్ర ఐదోరోజుకి చేరుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆరెస్సెస్ వారు ధరించే నిక్కర్‌కు మంట అంటుకున్నట్టు, దాన్నుంచి పొగ వచ్చే ఫోటోను పోస్ట్ చేసింది. దాంతో పాటు విద్వేష సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కల్పించి ఆరెస్సెస్ – బీజేపీ చేస్తున్న నష్టాన్ని నివారించేందుకు దశల వారీగా తమ లక్ష్యానికి చేరుకుంటామని పేర్కొంది. దీనికి భారత్ జోడో యాత్ర ట్యాగ్ జత చేస్తూ ఇంకా 145 రోజులు ఉన్నాయని పేర్కొంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవగా బీజేపీ తీవ్రంగా స్పందించింది. దేశంలో హింసను కోరుకుంటున్నారా? అని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ఇది భారత్ జోడో యాత్ర కాదు. భారత్ తోడో, ఆగ్ లగావో యాత్ర అంటూ సెటైర్ వేశారు. బెంగళూరు ఎంపీ తేజస్వీ స్పందిస్తూ.. కాంగ్రెస్ రాజేసిన నిప్పు వల్ల 1984లో ఢిల్లీ తగులబడింది. 2002లో 59 మంది కరసేవకులను సజీవ దహనం చేసింది. మరోసారి ఆ పార్టీ హింసను ప్రేరేపిస్తోంది. ఇలాంటి చేష్టలతోటే కాంగ్రెస్ రాజకీయ ఉనికిని కోల్పోయింది. అధికారం ఉన్న చత్తీస్ గఢ్, రాజస్థాన్‌లలో కూడా త్వరలో తుడిచిపెట్టుకొని పోతుందని విమర్శలు చేశారు.