Congress president Mallikarjuna Kharge compared PM Modi to Ravana
mictv telugu

ప్రతీ ఎన్నికల్లో మోడీ పేరు చెప్తున్నారు.. ఆయనకేమైనా పది తలలు ఉన్నాయా?

November 29, 2022

ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారంలో వేడి పెరుగుతోంది. స్వయంగా ప్రధాని మోదీ ప్రచారంలోకి దిగి బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకోసం విరివిగా ర్యాలీలు ఏర్పాటు చేసి ఓట్లడుగుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీని రావణుడితో పోలుస్తూ తీవ్ర విమర్శలు చేశారు.

 


మంగళవారం అహ్మదాబాద్ లో నిర్వహించిన ర్యాలీలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘మేము మోదీ ముఖాన్ని కార్పొరేషన్ ఎన్నికలు, పంచాయితీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు సహా ప్రతీచోటా చూస్తున్నాం. ఏ ఎన్నికల్లోనైనా మోదీ పేరు చెప్పి ఓట్లు అడగడాన్ని గమనించాం. నన్ను చూసి ఓటు వేయమని మోదీ అంటారు. ఆయనకేమైనా రావణుడిలా పది తలలు ఉన్నాయా? మోదీ మున్సిపాలిటీకి వచ్చి పని చేస్తారా? మీకు అవసరమైనప్పుడు ఆయన వచ్చి సాయం చేస్తారా? అని ప్రశ్నించారు. దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఆయన వ్యాఖ్యలు ప్రధానిని అవమానించడమేనని ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ అన్నారు. ‘ఖర్గే మాటలు అదుపు తప్పుతున్నాయి. గుజరాత్ బిడ్డ అయినందునే కాంగ్రెస్ ఆయనను అవమానిస్తోంది. ఈ వ్యాఖ్యలు ఆ పార్టీ తీరును ప్రతిబింబిస్తోంది’ అని విమర్శించారు.