రూ. 60 లకే లీటరు పెట్రోలు.. ఎక్కడో కాదు మన దేశంలోనే - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 60 లకే లీటరు పెట్రోలు.. ఎక్కడో కాదు మన దేశంలోనే

May 27, 2022

హెడ్డింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారా? కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా ఈ రేటు ఉండదు. మరి ఎవరు? ఎందుకు? ఎక్కడ అమ్ముతున్నారనే విషయాలను తెలుసుకుందాం. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న పరశురామ వాటిక సమీపంలోని పెట్రోల్ బంకులో రూ. 60 లకే లీటరు పెట్రోలు అమ్ముతున్నారు. అయితే కేవలం గంటపాటు మాత్రమే ఆ రేటుకు అమ్మారు. అది కూడా 21 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న యువకులకు మాత్రమే.

అయితే ఈ ఆఫర్ ఇచ్చింది బంకు యజమాని కాదు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ శాఖ ఈ పని చేసింది. ఎందుకని వివరణ అడగ్గా.. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రమోద్ ద్వివేది సమాధానం ఇచ్చారు. ‘పెట్రోల్ అసలు ధర రూ. 60 మాత్రమే. ఒక్క లీటరు పెట్రల్‌పై ఎంత పన్ను కడుతున్నామో యువత గుర్తించాలని ఈ పని చేశాం. చమురుపై విపరీత పన్నుల వల్ల ద్రవ్యోల్బణం పెరిగింది. మార్కెట్‌లో అన్ని వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వాలు ప్రజలను ఎలా దోచుకుంటున్నాయో యువత గుర్తించాలని’ వెల్లడించారు. కాగా, తక్కువ ధరకే పెట్రోల్ ఇస్తుండడంతో వాహన దారులు బంకుకు పోటెత్తారు. తోపులాట జరగడంతో పోలీసులను మొహరించారు. వరుస క్రమంలో ఒక్కొక్కరికి టోకెన్లు ఇచ్చి ప్రాధాన్య క్రమంలో పెట్రోల్ పోశారు.