ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి అయోమయంలో ఉన్న సంగతి తెలిసిందే. సీనియర్ లీడర్లు, వలస లీడర్ల మధ్య అంతర్గత పోరు నడుస్తున్నది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించి.. ఈ వివాదాలకు చెక్ పెట్టేందుకు ట్రబుల్ షూటర్ గా పేరొందిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ను రంగంలోకి దింపింది. ఇప్పటికే ఆయన.. పలువురు సీనియర్ నేతలకు ఫోన్లు చేసి సర్దిచెప్పారని సమాచారం. కొందరు సీనియర్ నేతలతో ఫోన్లో మాట్లాడి.. ప్రతి ఒక్కరి వాదనలు వింటామని చెప్పారు. అలాగే మంగళవారం సాయంత్రం జరగాల్సిన సీనియర్ నేతల కీలక సమావేశం రద్దయ్యేలా చేశారు.
ఈ క్రమంలోనే టీ కాంగ్రెస్ వ్యవహారాలను చక్కపెట్టేందుకు దిగ్విజయ్ సింగ్.. నేడు హైదరాబాద్కు రానున్నారు. ఈ రోజు రాత్రి 7.45 గంటల సమయంలో దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ చేరుకోనున్నట్టుగా సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై పట్టున్న దిగ్విజయ్.. గురువారం రేవంత్ రెడ్డి వర్గంతో పాటు, సీనియర్లతో కూడా భేటీ కానున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలతో విడి విడిగా సమావేశం కానున్నారు దిగ్విజయ్. అయితే గాంధీ భవన్లో ఈ సమావేశం ఏర్పాటు చేస్తారా? లేదా సీనియర్ నాయకుల ఇంటికే దిగ్విజయ్ నేరుగా వెళ్తారా? అనేది తెలియాల్సి ఉంది. దిగ్విజయ్ ఎంట్రీతో.. టీ కాంగ్రెస్లో నేతల మధ్య వివాదాలను చెక్ పడుతుందని ఆ పార్టీ క్యాడర్ భావిస్తుంది.