వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ ఏర్పడుతుందని, ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ కలవక తప్పదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్లు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే గెలవదు అంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలని వారి నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్. అర్థం పర్ధంలేని అంచనాలతో ఇటువంటి వ్యాఖ్యలు చేయవద్దని ఇది కార్యకర్తలను అవమానించటమేనన్నారు. ఊహాజనితంగా మాట్లాడి పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయవద్దని..అయోమయానికి గురిచేయవద్దని సూచించారు.
మరో కాంగ్రెస్ నేత మల్లు రవి మాట్లాడుతూ… పార్టీకి మేలు చేయకపోయిన ఫరవాలేదు. కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయవద్దు అంటూ కోమటిరెడ్డికి హితవు పలికారు. బీఆర్ఎస్ తోనే కాంగ్రెస్ కు పోటీ అంటూ సూచించారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే లోటుపాట్లు ఏమన్నా ఉంటే సరిచేసుకోవచ్చు…కానీ ఇలా బాహాటంగా ఇష్టానుసారంగా మాట్లాడితే అది పార్టీకి నష్టం చేకూరుస్తుందని దీన్ని గుర్తించి మాట్లాడాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోదని ఒంటరిగానే పోటీ చేస్తుందని మల్లు రవి తెలిపారు. తెలంగాణలో హంగ్ అనే మాటేలేదని కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు.
అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కొంత పరిస్థితి మెరుగుపడిందనుకునేలోగా ఏదో రూపంలో అది ఇబ్బందులు పడుతూనే ఉంది. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్‌ఛార్జి వచ్చారు. మాణికంరావు థాక్రే ఏదో ప్రయత్నాలు ప్రారంభించారు. నేతలందరినీ ఒక తాటిమీదకు తెచ్చి కాంగ్రెస్ కు పూర్వవైభవం తేవాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. యాభై నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర సాగుతుంది. ఈ క్రమంలో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించేలా ఉన్నాయి.