తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలి: సోనియా గాంధీ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలి: సోనియా గాంధీ

April 5, 2022

soniya

కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది.తెలంగాణలో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో సోమవారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు. మంగళవారం కాసేపటి క్రితమే సోనియా గాంధీతో సమావేశం ముగిసింది. అయితే, పార్టీ ఎంపీలపై సోనియా గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. పార్టీలో విభేదాలు పనికిరావని, అందరూ ఐకమత్యంతో కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాభవాలను చవిచూసిందని, దాంతో తాను షాక్‌కు గురైయ్యానని, ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు.

సోనియా గాంధీ మాట్లాడుతూ.. ”పార్టీని పటిష్ఠపరిచేందుకు నాకు చాలా మంది చాలా రకాలుగా సలహాలను ఇచ్చారు. అందులో చాలా విషయాలపై నేను ఎప్పటికప్పుడు దృష్టి పెడుతూనే ఉన్నాను. ఇటీవలి ఎన్నికల ఫలితాలు మిమ్మల్ని ఎంతలా అసంతృప్తికి గురుచేశాయో నేను అర్థం చేసుకోగలను. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనే మన సంకల్పం, చిత్తశుద్ధి, దృఢత్వానికి పరీక్ష ఎదురవుతుంది. కాబట్టి ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యమైంది పార్టీలో ఐకమత్యం. అందుకు నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను” అని సోనియా గాంధీ అన్నారు.

మరోపక్క ఎన్నికల్లో పరాజయం తర్వాత సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేశామని, చాలా మంది చాలా సలహాలిచ్చారని గుర్తు చేశారు. త్వరలోనే చింతన్ శిబిర్ (ఆత్మ పరిశీలన) కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నామని, ఇటీవలి సీడబ్ల్యూసీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నామని ఆమె వెల్లడించారు.