Congress suspends three Jharkhand MLAs detained with ‘large amount of cash’ in Bengal
mictv telugu

కారులో నోట్ల కట్టలు.. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెండ్

July 31, 2022

ఝార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పెద్ద మొత్తంలో నగదుతో పోలీసులకు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఒక ఎస్‌యూవీ వాహనంలో పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాలో రాణిహటి వద్ద జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ముగ్గురు ఎమ్మెల్యేలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఎమ్మెల్యేలను ఇర్ఫాన్‌ అన్సారీ, రాజేశ్‌ కచ్చప్‌, నమన్‌ బిక్సాల్‌ కొంగరిలుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నామని, ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ఝార్ఖండ్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి అవినాశ్‌ పాండే వెల్లడించారు.

బెంగాల్‌ వైపు నుంచి వస్తున్న ఎమ్మెల్యేల కారును పోలీసులు సోదా చేయగా పెద్దమొత్తం డబ్బు బయటపడింది. కారులో ఎమ్మెల్యేలతోపాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఝార్ఖండ్‌ ప్రభుత్వ మనుగడపై నీలినీడలు కమ్ముకున్నవేళ నోట్ల కట్టలతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పట్టుపబడటం సంచలనం కలిగింది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానానికి సిఫార్సు చేస్తానని ఝార్ఖండ్‌ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు బంధు టిర్కే తెలిపారు. జెఎంఎం నేతృత్వంలోని ఝార్ఖండ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిజెపి బేరసారాలు జరుపుతుందన్న వార్తల నేపథ్యంలో ఈ నగదు లభ్యమైందని తృణమూల్‌ కాంగ్రెస్‌ విమర్శించింది.