ఇటీవల తెలంగాణలో కురిసిన వర్షాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిక వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందనే సమాచారం తనకుందని బాంబు లాంటి విషయం చెప్పారు. గతంలో లద్దాఖ్, ఉత్తరాఖండ్లలో ఇలాంటి క్లౌడ్ బరస్ట్ ఘటనలు జరిగాయని, ఇప్పుడు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఆ కుట్రను అమలు పరుస్తున్నారని మండిపడ్డారు. దేశంలో అమెరికా తర్వాత అత్యధిక పంటలు పండే భూములు ఉండడంతో రైతులు, వ్యవసాయాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా ఈ కుట్ర ఉందని అభిప్రాయపడ్డారు. ఆదివారం భద్రాచలంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కేసీఆర్.. తర్వాత మీడియాతో సమావేశం నిర్వహించారు. అలాగే కడెం ప్రాజెక్టుకు చరిత్రలో ఎన్నడూ లేనంత వరద వచ్చిందని, దాని ఔట్ ఫ్లో కెపాసిటీ 2.90 లక్షల క్యూసెక్కులు అయితే సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని పేర్కొన్నారు. ఇంత భారీ వరదతో ఆ ప్రాజెక్టు కూలిపోతుందని భయపడ్డామని, కానీ, దేవుని దయ వల్ల ఆ ప్రాజెక్టు నిలబడిందని చెప్పుకొచ్చారు. ఇక వర్ష ప్రమాదం ఇంకా తొలగిపోలేదని ఈ నెల 29 వరకు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారని వివరించారు. దీంతో ఇప్పటివరకు కురిసిన వానలతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండాయని, ఇక నుంచి కురిసే ప్రతీ చినుకు వరదగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇక భూమి కూడా పీల్చుకునేందుకు ఎలాంటి అవకాశం లేదు కాబట్టి అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.