ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని చంపడానికి రష్యా కేంద్రంగా కుట్ర జరుగుతోందనే వార్త అంతర్జాతీయ స్థాయిలో సంచలనం రేపుతోంది. హత్య అమలును రష్యా ప్రైవేటు సైన్యం అయిన వ్యాగ్నర్ ద్వారా చేయించాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు అంతర్జాతీయ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. వ్యాగ్నర్ అనేది రష్యా ప్రైవేటు సైన్యంలా పని చేస్తుంది. దీనికి పుతిన్ సహచరుడు నాయకత్వం వహిస్తాడని, రష్యా వ్యూహాత్మక ప్రయోజనాల కోసం అనధికారికంగా ఈ సంస్థను ప్రారంభించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని ద్వారా జెలెన్ స్కీ, ఉక్రెయిన్ ప్రధాని, కీవ్ మేయర్ సహా ప్రభుత్వంలోని 23 మంది పెద్దలను హతమార్చడానికి పుతిన్ ఇంతకు ముందే ఆదేశాలిచ్చినట్టు వ్యాగ్నర్ గ్రూప్ లోని సభ్యుడిని ఉటంకిస్తూ ఆ కథనం పేర్కొంది. 2014 లో స్థాపించబడిన ఈ సంస్థ సభ్యులు ఇప్పటికే ఉక్రెయిన్లో ప్రవేశించారనీ, ఇరు దేశాల మధ్య చర్చల నేపథ్యంలో హత్య అమలును వాయిదా వేశారని వివరించింది. కాగా, రష్యాకు మొదటి ప్రాధాన్యత తనను చంపడమేనని కొద్ది రోజుల క్రితం జెలెన్ స్కీ ప్రకటించి ఉన్న నేపథ్యంలో ఇలాంటి వార్త రావడం పలు దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.