నా కొడుకు వేలు పెట్టడం లేదు.. యడియూరప్ప సమర్థన  - MicTv.in - Telugu News
mictv telugu

నా కొడుకు వేలు పెట్టడం లేదు.. యడియూరప్ప సమర్థన 

September 18, 2020

Conspiracy to drag my son’s name to create confusion: Karnataka CM

తన కుమారుడిపై వస్తున్న విమర్శలను కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఖండించారు. ఆయన కుమారుడు బీవై విజయేంద్ర రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అయితే విజయేంద్ర సూపర్ సీఎం మాదిరి వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శించడాన్ని యడ్డీ కొట్టి పారేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా యడియూరప్ప ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడిపై వస్తున్న విమర్శలపై మాట్లాడారు. ‘పార్టీ కోసం విజయేంద్ర కష్టపడి పని చేస్తున్నాడు. పాలనలో అతను జోక్యం చేసుకోవడం లేదు. నా కుమారుడి రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు’ అని యడియూరప్ప అన్నారు. 

మరోవైపు కర్ణాటకలో జేడీఎస్‌తో బీజేపీ చేతులు కలుపుతోందనే వార్తలపై కూడా యెడ్డీ స్పందించారు. ‘ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా ఇటీవల కుమారస్వామి నన్ను కలిశారు. ఇద్దరం కలిసి అభివృద్ది పనులపై చర్చించాం. అంతే తప్ప మా మధ్య రాజకీయపరమైన అంశాలు ఏవీ చర్చకు రాలేదు. మాకు పూర్తి మెజార్టీ ఉంది. జేడీఎస్ మద్దతు మాకు అవసరం లేదు’ అని స్పష్టంచేశారు. అలాగే రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై నడ్డాతో చర్చించినట్టు తెలిపారు.