అయ్యన్నపాత్రుడి హత్యకు కుట్ర.. ఒకడి అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యన్నపాత్రుడి హత్యకు కుట్ర.. ఒకడి అరెస్ట్

October 24, 2020

Conspiracy to incident Ayyannapatrudu .. One arrested.jp

మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు హత్యకు కుట్ర జరిగిందని తెలుస్తోంది. ఆయన ప్రాణాలు తీసేందుకు ఒప్పందం జరిగినట్టు ఓ సందేశం తీవ్ర కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన లావాదేవీలు కూడా జరిగినట్టు ఆ టెక్ట్స్‌లో ఉంది. ఈ వ్యవహారంలో తాతారావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని చంపేందుకు కొందరు పక్కా స్కెచ్ వేశారని.. ఇందుకు సంబంధించిన లావాదేవీలు కూడా జరిగాయంటూ ఓ వ్యక్తి ఆయనకు మెసేజ్ పంపాడు. అదేవిధంగా మరో ఆరుగురు నేతలకు ప్రాణహాని ఉందంటూ హెచ్చరికలు ఉన్నాయని పేర్కొన్నాడు. మరణాలను మావోయిస్టుల హత్యగా నమ్మించేందుకు ఏర్పాట్లు జరిగాయని.. దానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపాడు.

మెసేజ్ పంపిందే కాక తాను ఓ ఎస్సై అని కూడా చెప్పుకొచ్చాడు. దీంతో అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో బుచ్చయ్యపేట మండలం కేపీ అగ్రహారానికి చెందిన వియ్యపు తాతారావు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేస్తూ తాతారావు డబ్బులు వసూలు చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. కాగా, విశాఖపట్నం రూరల్ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని దూషించిన వ్యవహారంలో అయ్యన్న పాత్రుడిపై ఈ ఏడాది జూన్ మాసంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై స్వయానా కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేయకూడదని ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.