ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు దరఖాస్తు గడువును పెంచుతూ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 7 సాయంత్రం 5 గంటల వరకు, ఎస్సై పోస్టులకు మాత్రం ఇంతకుమందులాగే జనవరి 18 సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకుముందు నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం కానిస్టేబుల్ పోస్టులకు డిసెంబర్ 28వ తేదీని చివరి గడువుగా ప్రకటించారు. అయితే కరోనా కారణంగా రెండేళ్లు వృథా అవడంతో అభ్యర్ధుల నుంచి వయోపరిమితి పెంపుపై డిమాండ్లు వచ్చాయి. వారి డిమాండ్లను ఆలకించిన ప్రభుత్వం రెండేళ్ల గడువు పెంచింది. దీంతో మరికొంత మంది అభ్యర్ధులకు దరఖాస్తు చేసే అవకాశం కలుగగా, ఇలాంటి అభ్యర్ధుల సౌలభ్యం కోసం కానిస్టేబుల్ ఉద్యోగాల దరఖాస్తు గడువును పెంచారు. కాగా, ఏపీలో 6100 కానిస్టేబులో పోస్టులు, 411 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టులకు మహిళ, పురుష అభ్యర్ధులు అర్హులు. ఏపీఎస్పీ రిజర్వ్ ఎస్సై పోస్టులకు మాత్రం కేవలం పురుషులు మాత్రమే అర్హులు. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న, ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమ్స్ రాతపరీక్ష నిర్వహించనున్నారు.