కెమికల్స్ గ్యాస్ ఘటన.. డ్యూటీకి వెళ్తున్న కానిస్టేబుల్‌కు అస్వస్థత - MicTv.in - Telugu News
mictv telugu

కెమికల్స్ గ్యాస్ ఘటన.. డ్యూటీకి వెళ్తున్న కానిస్టేబుల్‌కు అస్వస్థత

May 7, 2020

Constable Illness In Visakha Gas Leakage

ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి కెమికల్ గ్యాస్ లీకైన ఘటన తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే వందలాది మంది ప్రజలు కుప్పకూలి పోవడంతో వారిని ఆస్పత్రులకు చేర్పించారు. ఇప్పటికే మగ్గురు మరణించారు. మృతుల్లో ఇద్దరు వృద్ధులు, ఎనిమిదేళ్ల బాలిక ఉన్నట్టుగా తెలుస్తోంది. సహాయక చర్యలు అందిస్తున్న పోలీసులు, అంబులెన్సు డ్రైవర్లు కూడా అస్వస్థతతకు గురౌతున్నారు. విషవాయువు దాటికి చెట్లు కూడా వాడిపోయాయి. జంతువులు పక్షులు విలవిలలాడిపోతున్నాయి. గాలిని పీల్చుకోవడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. రోడ్డుపై ఎక్కడ చూసిన పిట్టల్లా కూలిపోయి ప్రజలు కనిపిస్తున్నారు. 

ఉదయాన్నే డ్యూటీకి వెళ్లేందుకు సిద్ధమైన ఓ కానిస్టేబుల్ కూడా కుప్పకూలిపోయాడు.  విశాఖ రైల్వే స్టేషన్‌‌లో పని చేస్తున్న ఆయన విధులకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే విషవాయువులు లీకైంది. అంతలోనే అతడు కుప్పకూలిపోయాడు. అధికారులు ఇంటింటికి తిరిగి ఎవరైనా ఇళ్లలో పడిపోయి ఉన్నారో తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది కూడా గాలిని పీల్చి అస్వస్థతకు గురౌతున్నారు. 

దాదాపు 25 అంబులెన్సులు రప్పించి బాధితులను కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. స్థానికులు కూడా అధికారులకు తోడుగా నిలిచి ప్రైవేటు వాహనాల్లోనూ బాధితులను ఆస్పత్రికి చేర్చుతున్నారు. కంపెనీకి ఐదు కిలోమీటర్ల  పరిధిలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ఘటన ఎలా జరిగింది అనేది ఇంకా తెలియడం లేదు. ప్రస్తుతానికి ప్రజలను రక్షించే పనిలో ఉన్నట్టుగా కలెక్ట్ వెల్లడించారు.