హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో విషాదం చోటుచేసుకున్నది. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న ఓ కానిస్టేబుల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటు రావడంతో క్షణాల్లోనే కన్నుమూశాడు. నగరంలోని ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నర్వహిస్తున్న విశాల్(24).. రోజూలానే శుక్రవారం ఉదయం బోయిన్‌పల్లిలోని ఓ జిమ్‌కు వెళ్లారు. వ్యాయామం చేస్తూ ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందోనని సహచరులు వచ్చి చూసేలోపే మృతిచెందాడు. అయితే ఆయనను దవాఖానకు తరలించగా గుండెపోటుతో మరణించాడని వైద్యులు నిర్ధారించారు. విశాల్ 2020 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. 2023లో ఉద్యోగాన్ని సంపాదించి ఆసీఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అతడి హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
ఇటీవల చాలామంది వయసుతో సంబంధం లేకుండా.. హఠాత్తుగా కుప్పకూలిపోయారు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ 40 ఏళ్ల కే గుండెపోటుతో మృతి చెందేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అప్పటి వరకూ చాలా యాక్టివ్‌గా కనిపించి ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. పునీత్ నుంచి తారకరత్న దాకా.. గుండెపోటుతో మృత్యువాత పడిన వారే. నిత్యం వ్యాయామం చేసేవారినీ కూడా హార్ట్ ఎటాక్ వదులడం లేదు. ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. హార్ట్ ఎటాక్.. కార్డియాక్ అరెస్ట్.. కారణమేదైనా నాలుగు పదుల వయసులోనే చాలా మంది ఊపిరి ఆగిపోతోంది. అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్న మనిషి ఉన్నట్టుండి కుప్పకూలి, తిరిగి లేవడం లేదు.