Constable's complaint against SP
mictv telugu

ఏపీ.. ఎస్పీపై కానిస్టేబుల్ ఫిర్యాదు, కేసు నమోదు

August 31, 2022

జిల్లా ఎస్పీపై సాధారణ కానిస్టేబుల్ ఫిర్యాదు చేసిన ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగింది. ఎస్పీ ఫకీరప్పపై ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ ఫిర్యాదు చేయడంతో అనంతపురం టూటౌన్‌ పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీతో పాటు ఏఎస్పీ, డీఎస్పీలపై లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళితే.. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌పై ఐదు క్రిమినల్ కేసులు ఉండడంతో పోలీసులు ప్రకాశ్‌ను సస్పెండ్ చేశారు. అంతేకాక, పోలీసు క్వార్టర్ ఖాళీ చేయాలని మంగళవారం నోటీసులు కూడా పంపారు. దీంతో ఆగ్రహించిన ప్రకాశ్.. బాధితురాలు లక్ష్మికి పది లక్షల రూపాయలు ఇచ్చి మరణ వాంగ్మూలం మార్చేశారని, దళితుడైన తనపై చిన్న చూపుతో కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన పోలీస్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. 2019లో తనపై నమోదైన కేసు కోర్టులో విచారణ నడుస్తుండగానే పోలీసులు విచారణ చేపట్టి దోషిగా తేల్చారని మండిపడ్డారు. ప్రస్తుత సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ పాషా, ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ ఇద్దరు సీఐల నేతృత్వంలో పూర్తి పక్షపాతంగా విచారణ సాగిందని వ్యాఖ్యానించారు. నేరం రుజువైందని వారికి వారే నిర్ణయించుకొని ఉద్యోగం నుంచి తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.