Construction of overpass on national highway at Wankidi
mictv telugu

రాష్ట్రంలో తొలిసారి ఓవర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం.. ఎక్కడంటే

November 23, 2022

Construction of overpass on national highway at Wankidi

అడవుల మీదుగా వెళ్లే జాతీయ రహదారుల్లో వాహనాల వల్ల వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉండడం తెలిసిందే. ఈ ముప్పు తప్పించడానికి జంతువులు రోడ్డు దాటడం కోసం ఓవర్ పాస్ వంతెనల నిర్మాణం చేస్తారు. ఇలాంటివి ఎక్కువగా విదేశాల్లో కనిపించినా మన దేశంలో కూడా ఈ మధ్య ఇలాంటి వంతెనల నిర్మాణం ప్రారంభమైంది. ఈ బ్రిడ్జీలు సాధారణ వంతెనలా కాకుండా అటవీ మార్గం మాదిరి గడ్డితో కనిపిస్తుంటాయి. వంతెన పై భాగం మొత్తం పచ్చగా ఉంటుంది. పైన జంతువులు వెళ్లడానికి అనువుగా, కింద వాహనాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా దూసుకెళ్లడానికి వీలుగా ఇలాంటి వంతెనలు నిర్మిస్తారు. ఇలాంటి వంతెనను తెలంగాణలో తొలిసారి నిర్మించబోతున్నారు.

కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలోని మంచిర్యాల – చంద్రాపూర్ మార్గంలో ఉన్న 63వ జాతీయ రహదారిపై వాంకిడి సమీపంలో దీన్ని నిర్మిస్తున్నారు. పర్యావరణపరంగా చాలా సున్నితమైన ఈ ప్రాంతంలో పులులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వచ్చే పులులు ఈ మార్గం గుండానే రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో రహదారిని దాటేటప్పుడు వాహనాలకు అడ్డు రాకుండా ఇలాంటి వంతెనలు ఉపయోగపడతాయి. రూ. 30 కోట్ల ఖర్చుతో జాతీయ రహదారుల సంస్థ నిర్మించే ఈ వంతెన పనులు ఇప్పటికే మొదలయ్యాయి. అటవీ శాఖతో సంయుక్తంగా జరుగుతున్న ఈ పనులు ఇంకో ఆరు నెలల్లో పూర్తవుతాయని అటవీశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పనుల నిర్వహణలో అన్ని పర్యావరణ అనుకూల చర్యలను అనుసరిస్తున్నట్టు వివరించారు. వైల్డ్ లైఫ్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేస్తున్నట్టు వెల్లడించారు.