తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న సెక్రటేరియట్ పది లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇంతవరకు భవనం బయటినుంచి ఎలా ఉంటుందో చూడడం తప్ప లోపల ఉన్న ప్రత్యేకతలు ఏంటనేది ఇప్పటివరకు తెలియలేదు. తాజాగా సెక్రటేరియట్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. భవన భూగర్భంలో ఏకంగా మినీ రిజర్వాయర్ని నిర్మించారంట. దీని సామర్ధ్యం రెండున్నర లక్షల లీటర్లు. భవనం నలువైపులా కురిసే వాననీటిని ఈ రిజర్వాయర్లోకి తరలిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా పైపులైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సచివాలయం ముందు దాదాపు తొమ్మిది ఎకరాల్లో పచ్చిక లాన్లున్నాయి.
వీటి నిర్వహణకు కావాల్సిన నీటి అవసరాన్ని ఈ రిజర్వాయర్ తీరుస్తుందని భావిస్తున్నారు. బయట రోడ్డు కంటే సచివాలయం బేస్ ఐదు అడుగుల ఎత్తు ఉండడంతో భారీ వర్షం పడ్డా ఎక్కడా నీరు నిలిచే పరిస్థితి ఉండదు. ఇక భవనంలో వేల సంఖ్యలో ఉండే విద్యుత్ దీపాల కోసం భవనంపైన రూఫ్టాప్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా కొంతైనా విద్యుత్ పొదుపు సాధ్యమవుతుంది. వీటితో పాటు సచివాలయం ప్రధాన ద్వారం ముందు వంద అడుగుల వెడల్పు, వేయి అడుగుల పొడవుతో రోడ్డు నిర్మిస్తున్నారు. వివిధ పనుల కోసం వచ్చేవారి కోసం ఇక్కడ 300 కార్లను పార్క్ చేసుకునే వీలుంటుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ నూతన సెక్రటేరియట్ వచ్చే నెల 17న ప్రారంభం కానుంది.