డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ పొందిన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్.. గురించి మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) పలు కీలక విషయాలు తెలిపింది. అమెరికాలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పటి నుంచే అతడు గంజాయి తాగడం మొదలెట్టాడని చెప్పింది. ఈ విషయాన్ని అతడే స్వయంగా అంగీకరించారని కూడా తెలిపింది. నిద్రలేమి సమస్యల వల్ల బాధపడుతున్నానని.. ఆ ప్రాబ్లెం సొల్యూషన్ కోసం గూగుల్లో సెర్చ్ చేయగా… గంజాయి సేవిస్తే కాస్త ఉమశమనం కలుగుతుందని చదివినట్లు చెప్పాడు. అప్పటి నుంచి ఉపశమనం పొందేందుకు దాన్ని తీసుకోవడం మొదలుపెట్టినట్లు ఆయన చెప్పారని ఎన్సీబీ పేర్కొంది.
తన ఫోన్లో దొరికిన వాట్సాప్ డ్రగ్ చాట్ కూడా తానే చేసినట్లు అంగీకరించాడని ఎన్సీబీ తెలిపింది. ‘దోఖా’ అనే కోడ్వర్డ్తో గంజాయి కొనుగోలు కోసం ఈ కేసులో మరో నిందితుడైన ఆచిత్తో వాట్సాప్ చాట్ చేశానని ఒప్పుకొన్నట్లు ఛార్జిషీట్లో తేలింది. మరోవైపు.. ఆర్యన్ ఫోన్ను అధికారికంగా స్వాధీనం చేసుకోలేదని, ఆ ఫోన్ నుంచి సేకరించిన చాటింగ్ వివరాలేవీ అతనికి ప్రస్తుత కేసుతో సంబంధం ఉన్నట్లు నిరూపించలేదని ఎన్సీబీ వెల్లడించింది. గత ఏడాది అక్టోబరులో క్రూజ్ నౌకపై డ్రగ్స్ దొరికిన కేసులో ఆర్యన్ సహా మరో ఐదుగురికి ఈ నెల 27న ఎన్సీబీ క్లీన్చిట్ ఇచ్చింది. మరో 14 మందిపై దాదాపు 6 వేల పేజీల అభియోగపత్రం మోపింది. అందులో ఆర్యన్ సహా ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాల వివరాలను, తమ దర్యాప్తులో గుర్తించిన అంశాలను ఎన్సీబీ తెలిపింది.