క్యాబ్ డ్రైవర్లూ జాగ్రత్త..  సాగదీస్తే భారీ జరిమానాలు - MicTv.in - Telugu News
mictv telugu

క్యాబ్ డ్రైవర్లూ జాగ్రత్త..  సాగదీస్తే భారీ జరిమానాలు

November 19, 2019

Consumer Forum Order Pay Rs 50k to Customer Missed Train

ట్రాన్స్ పోర్టింగ్ వ్యవస్థలో క్యాబ్ సేవలు ఇప్పుడు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణం సులభతరం కావడంతో  ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. కానీ కొన్ని సందర్భాల్లో క్యాబ్ సేవలు చిరాకు తెప్పిస్తుంటాయి. ట్రాఫిక్ జామ్ అంటూ.. ఎక్కువ దూరం ప్రయాణిస్తే చార్జీ ఎక్కువగా వస్తుందనే ఆలోచనతో కొంత మంది డ్రైవర్లు ఆలస్యం చేస్తుంటారు. అలాగే ఓ క్యాబ్ డ్రైవర్ ప్రయాణికుడిని సమయానికి రైల్వేస్టేషన్‌లో చేర్చకపోవడంతో వినియోగదారుల ఫోరం భారీగా జరిమానా విధించింది. 

హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న కేవీ వరప్రసాద్ 2016 సెప్టెంబర్ 19న తన కుటుంబంతో కలిసి కాకినాడ వెళ్లేందుకు డాట్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. సికింద్రాబాద్‌ వెళ్లే సమయంలో ట్రాఫిక్ జాం ఉందంటూ తిప్పుకుంటూ చాలా ఆలస్యం చేస్తూ రైల్వే స్టేషన్ తీసుకెళ్లారు. అప్పటికే  కాకినాడ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లిపోయింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తమ ప్రయాణం వాయిదా పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత్యంతరం లేక మరుసటి రోజు విమానంలో వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత తనకు జరిగిన అసౌకర్యంపై వినియోగదారుల ఫోరంలో కేసు వేశాడు. 

దీనిపై విచారణ చేపట్టిన జడ్జి ఇది డ్రైవర్‌ సేవాలోపమేనని పేర్కొన్నారు. దీనికి పరిహారంగా క్యాబ్ డ్రైవర్ వరప్రసాద్‌కు విమాన చార్జీలు రూ. 31,567 తో పాటు ఇతర ఖర్చుల కోసం మరో 20వేలతో అంతా కలిపి రూ. 51,567 వేలు చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పు నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్లు పనిగట్టుకొని ఆలస్యం చేసినా.. నాణ్యమైన సేవలు అందించకపోయినా వాత తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని వేగంగా పని పూర్తి చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.