ఏపీలో కంటైన్మెంట్ కొత్త నిబంధనలు ..
ఏపీ ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనల నుంచి మెల్లమెల్లగా ఊరట కల్పిస్తోంది. తాజాగా కొన్ని మినహాయింపులు ఇచ్చిన అధికారులు కంటైన్మెంట్ జోన్ల పరిధిని తగ్గించారు. కానీ నిబంధనలు మాత్రం కఠినంగానే అమలు చేయాలని అధికారులకు సూచించారు. దీంతో ఇప్పటి వరకు కంటోన్మెంట్ జోన్ల పరిధి 3 కిలోమీటర్ల వరకు ఉండగా అది కేవలం 200 మీటర్లకు మాత్రమే పరిమితమైంది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎవరూ ఇళ్లు దాటి బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నారు.
పలు ప్రాంతాల్లో ప్రజలు బయటకు రావడానికి, షాపులు తెరవడానికి అనుమతులు వచ్చాయి. కానీ కంటైన్మెంట్ ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలు అలాగే కొనసాగుతున్నాయి. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడికి అధికారులే నేరుగా వెళ్లి నిత్యావసరాలు అందజేయాలని సూచిస్తున్నారు. ఐసీఎంఆర్ ఆదేశాల ప్రకారం కంటైన్‌మెంట్ జోన్లను మూడు రకాలుగా వర్గీకరించారు. 10కి మించి కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ‘మోస్ట్ యాక్టివ్’, పదిలోపు కేసులుంటే ‘యాక్టివ్’ అంత కన్నా తక్కువగా ఉంటే ‘డార్న్ మెంట్’ ప్రాంతాలుగా గుర్తిస్తున్నారు. కాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇప్పటి వరకు ఉన్న కంటైన్మెంట్ ప్రాంతాల్లో ప్రజలకు కాస్త ఊరట కలిగింది.