కొడకా.. నాది కడప.. బాంబులేచ్చా..! - MicTv.in - Telugu News
mictv telugu

కొడకా.. నాది కడప.. బాంబులేచ్చా..!

December 5, 2017

రాయలసీమ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో ఫ్యాక్షన్ గురించి, దందాల గురించి  చాలా అతిగా చూపుతుంటారు. లేనిది ఉన్నట్లు చూపుతుంటారు. అయితే ఇలాంటి కంత్రీ కాంట్రాక్టర్ల చేష్టలు చూసినప్పుడు.. ఆ సినిమాల్లో చూపేది నిజమేనేమో అనిపించకమానదు. ఇలాంటి నీచుల వల్ల ఒక ప్రాంతానికి చెడ్డపేరు రావడం విషాదం.


‘‘రేయ్‌.. కొడకా.. నాది కడప రేయ్.. నాది జమ్మలమడుగు.. నాతో పెట్టుకోవద్దు.. నాకు తిక్క రేగిందా.. బాంబులు తెచ్చి మీ ఆఫీసు మీదేస్తా..’’ కాంట్రాక్టర్ నరసింహారెడ్డి నోట జాలువారిన మహత్తర సుభాషితాలు ఇవి. అనంతపురం మునిసిపల్ డిప్యూటీ ఇంజినీరు కిష్టప్పను సోమవారం నగరంలోని రఘువీరా టవర్స్ వద్ద ఈ కంత్రీ కాంట్రాక్టర్  బూటు కాళ్లతో తన్నుతూ, మాటల్లో చెప్పలేని బూతులు తిడుతూ దాడి చేశాడు. డీఈ ఏం చెబుతున్న వినకుండా కాళ్లతో ఎగిరెగిరి తన్నాడు. చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఆ రాక్షసుడికి భయపడి జోక్యం చేసుకోలేదు. ఈడీకి ముఖానికి గాయాలయ్యాయి.  

తనకు రావాల్సిన బిల్లు జాప్యం కావడంతో కాంట్రాక్టర్ ఇలా ప్రవర్తించాడు. రోడ్లు ఊడ్చే యంత్రాలను సరఫరా చేస్తున్నాడు రెడ్డి. ఈడీ ఇదివరకు రూ.23 లక్షలు చెల్లించారు. మరో రూ.15 లక్షల వరకూ బిల్లు చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఎంక్వరీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై రెడ్డి మునిసిపల్ ఆఫీసుకు వచ్చి ఇంజినీర్లను తిట్టాడు.

డీఈ కిష్టప్ప జోక్యం చేసుకుని సభ్యతగా మాట్లాడాలని కోరు. దీంతో రెడ్డికి కోపమొచ్చింది. నువ్వెవరు చెప్పడానికి అంటూ ఎదురుతిరిగాడు. గొడవ సద్దుమణిగాక.. కిష్టప్ప తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా రఘువీరా టవర్స్‌ వద్ద నరసింహారెడ్డి ఆ అడ్డుకున్నాడు. రోడ్డుపైనే విచక్షణరహితంగా కొట్టాడు. కిష్టప్ప తర్వాత వన్‌టౌన్‌ పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. నగరపాలక సిబ్బందితో పాటు పలువురు గుత్తేదారులు డీఈకి మద్దతుగా స్టేషనుకు వెళ్లారు. పోలీసులు రెడ్డిని అరెస్ట్ చేశారు. కిష్టప్పపై దాడికి నిరసనగా మునిసిపల్ ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు.