కర్ణాటక కేడర్‌కి చెందిన తెలుగు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరిని వివాదాలు వలదడం లేదు. తోటి ఐపీఎస్ మహిళా అధికారిణి డి. రూపా తీవ్రమైన ఆరోపణలు చేశారు. రోహిణి పెద్దఎత్తున అవినీతికి పాల్పడిందని, ఈ విషయం తెలుసుకున్నానని తన నగ్న చిత్రాలను ముగ్గురు అధికారులకు పంపినట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయని స్క్రీన్ షాట్లు షేర్ చేసింది. ఇలా 19 ఆరోపణలతో కూడిన జాబితాను మీడియాకు రిలీజ్ చేసింది. ఇందులో మైసూరులో భూఆక్రమణ ఆరోపణలు ఉన్న జనతాదళ్ సెక్యులర్ ఎమ్మెల్యే మహేశ్‌తో కలవడం కూడా ఉంది. ఒక ఐఏఎస్ అధికారిణికి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలతో ఏం పని ఉంటుందని, గతంలో సీనియర్ అధికారితో ఎమ్మెల్యేను కలిసిన అంశాన్ని బహిర్గతం చేసింది. బెంగళూరు జాలహళ్లిలో విశాలమైన ఇంటిని నిర్మించుకున్నారని, ఐటీ రిటర్న్స్‌లో ఈ అంశం ప్రస్తావించలేదన్నారు.
ఆ ఇంట్లో కోట్ల విలువ చేసే ఇటాలియన్ ఫర్నీచర్, 26 లక్షల విలువ చేసే జర్మన్ ఇంటీరియర్స్‌ని వాడారని, వీటన్నింటికి డబ్బులెక్కడివి అంటూ నిలదీశారు. ఈ నేపథ్యంలో రోహిణి ప్రధాన కార్యదర్శి వందితతో భేటీ అయి వివరణ ఇచ్చారు. తనపై రూప చేసిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు. సివిల్ సర్వీసెస్ అధికారులు బహిరంగంగా విమర్శలు చేయకూడదన్న డీఓపీటీ నిబంధనలను రూప ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న రూపపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, రోహిణి సింధూరికి ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుంది. అయితే గతంలో రోహిణి మైసూరు కలెక్టర్‌గా పని చేసినప్పుడు పలు ఆరోపణలు వచ్చాయి.
తనపై చేస్తున్న ఒత్తిడిని భరించలేక 2001లో మైసూరు మున్సిపల్ కమిషనర్ శిల్పానాగ్ సర్వీసుకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం సంచలనంగా మారింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వెంటనే రోహిణిని బదిలీ చేసి వివాదాన్ని పరిష్కరించారు. తాజా ఆరోపణలతో సీఎం బస్వరాజ్ బొమ్మై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ‘ఇద్దరు సామాన్యులు కూడా ఇలా బహిరంగంగా విమర్శలు చేసుకోరు. వ్యక్తిగతంగా ఎలాంటి విరోధం ఉన్నా మీడియా ముందు ఇలా ప్రవర్తించడం మంచిది కాదు. ఈ వ్యవహారంపై సీఎం, పోలీస్ చీఫ్‌తో చర్చించాము’ అని హోంమంత్రి వెల్లడించారు. కాగా, రోహిణి సింధూరి ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖకు కమిషనర్‌గా, రూప హస్తకళల అభివృద్ధి సంస్థకు ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు.