Controversy between Vasireddy Padma and Vangalapudi Anita
mictv telugu

ఊరికో ఉన్మాది పుస్తకం.. వాసిరెడ్డి పద్మ, వంగలపూడి అనిత మధ్య రచ్చ

April 27, 2022

Controversy between Vasireddy Padma and Vangalapudi Anita

మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, టీడీపీ నాయకురాలు వంగలపూడి అనితల మధ్య బుధవారం వాగ్వివాదం జరిగింది. చంద్రబాబు, బోండా ఉమలకు మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం, బుధవారం కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వంగలపూడి అనిత నాయకత్వంలో తెలుగు మహిళల ముట్టడితో కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కమిషన్ చైర్మన్ అయినా బయటికి రావాలి, లేదా మహిళలపై నేరాలకు సంబంధించి మేమిచ్చే వినతి పత్రమైనా తీసుకోవాలని అనిత పట్టుబట్టడంతో కొందరు మహిళలకు పోలీసులు లోపలికి వెళ్లడానికి అనుమతినిచ్చారు.

ఈ సందర్భంగా విజయవాడ ఆస్పత్రి ఘటన నిందితులతో పాటు అన్ని అత్యాచార ఘటనల్లో పాల్గొన్న నిందితులను కఠినంగా శిక్షించాలని వాసిరెడ్డి పద్మను కోరారు. అనంతరం ‘సీఎం జగన్ పాలనలో ఊరికో ఉన్మాది’ అనే పుస్తకాన్ని అనిత పద్మకు అందజేశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, ఇలాంటి ఆరోపణలు సరికాదని వాసిరెడ్డి పద్మ సూచించారు. దీంతో ఇప్పటివరకు జరిగిన 800 అత్యాచార ఘటనల్లో ఎంతమందికి నోటీసులు ఇచ్చారని అనిత ప్రశ్నించగా, పుస్తకాన్ని పరిశీలించి జవాబిస్తానని వాసిరెడ్డి పద్మ బదులిచ్చారు.