ఆంధ్రప్రదేశ్‌లో ఓ థియేటర్ అద్ధాలను ఆర్ఆర్ఆర్ అభిమానులు పగలగొట్టిన సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం గతకొన్ని రోజులుగా ఎదురుచూసిన అభిమానులు శుక్రవారం సినిమా విడుదలైన సందర్భంగా విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్లో సినిమా ప్రదర్శన జరుగుతుండగా, సాంకేతిక లోపం తలెత్తడంతో ఆట ఆగిపోయింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రాంచరణ్, జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కేరింతలు కొడుతూ, సినిమా హాల్స్‌లోని సామాగ్రిని పగలకొట్టారు. ఈ క్రమంలో నినాదాలు చేస్తూ థియేటర్లోని అద్దాలను ధ్వంసం చేశారు.
దీంతో అలర్ట్ అయిన థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే థియేటర్ వద్దకు చేరుకున్న పోలీసులు అభిమానులు చేస్తున్న అల్లర్లను అదుపు చేశారు. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం‘ఆర్ఆర్ఆర్’సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా కోసం ఫ్యాన్స్ తెల్లవారుజామునే థియేటర్లకు వెళ్లి క్యూ కట్టారు. ఈ తరుణంలో విజయవాడలో ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించటం కలకలం రేపింది.