మనిషిని పుట్టినప్పుడు బట్టలేదు.. చనిపోయాక బట్టే కాదు, అసలేమీ ఉండదు. నగ్నంగా మొదలైన మానవ సమాజం ఎన్నెన్నో విద్యలు చేర్చి ఎన్నెన్నో దుస్తులు ధరించి.. చివరికి ఫ్యాషన్ కోసం వాటికి రంధ్రాలు చేసుకునే స్థాయి దాకా ఎదిగింది.
దుస్తుల చరిత్రలో బుర్ఖా అంత వివాస్పదమైంది మరొకటి లేదు. బికినీపై వివాదం వేరే సంగతి. దాన్ని వేసుకుని బయట తిరిగే స్థాయికి మానవ సమాజం ఇంకా చేరుకోలేదు. కానీ బుర్ఖాపై నిత్యం ఎక్కడో ఒక చోట వివాదాలు నడుస్తుంటాయి. దానికి మద్దతుగా, వ్యతిరేకంగా శతాబ్దాల తరబడి చర్చలు సాగుతున్నాయి. మొన్న శ్రీలంకలో 300 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద దాడులతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం బుర్ఖాను నిషేధించింది. నిన్న కేరళలోని ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎంఈఎస్) కూడా అదే పని చేసింది. తమ విద్యా సంస్థల్లో చదువుకునే అమ్మాయిలు బుర్ఖాలు వేసూకోకూడదని నిషేధం విధించింది. దీంతో దుమారం రేగింది. సొసైటీ అధ్యక్షుణ్ని చంపేస్తామని ఫోన్లు కూడా వస్తున్నాయి. బుర్ఖాపై వివాదాలు కేవలం భారత ఉపఖండానికే పరిమితం కాదు. ముస్లింలే కాదు, క్రైస్తవ జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో ‘ముసుగు’ వివాదాల ముసురు కమ్ముకుంటూనే ఉంది.
ఇస్లాం కంటే ముందే…
చాలామంది భావిస్తున్నట్లు బుర్ఖా ఇస్లాం మతంతో కలసి పుట్టలేదు. దానికంటే శతాబ్దాల ముందు నుంచే వేరువేరు రూపాల్లో కొనసాగుతోంది. గ్రీకు, బైజాంటియం, అస్సీరియన్ తదితర నాగరికతల్లో ఇది రకరకాల వేషాల్లో కనిపిస్తుంది. ముఖం వరకు ముసుగులు, పొట్ట వరకు ముసుగులు, కేవలం తలపై ముసుగులు.. ఎన్నో రకాలు.
మన దేశంలో మొన్నటివరకు కులీన కుటుంబాల్లో, ముఖ్యంగా జమీందారీ కుటుంబాల్లో కొనసాగిన పరదా పద్ధతి ఒకరకంగా బుర్ఖా సంప్రదాయమే..
ఉద్దేశం..
భర్తకు, ఇంట్లోని కొద్దిమంది పురుషులకు తప్ప బయటి పురుషులకు ముఖం, వెంట్రుకలు, ఇతర భాగాలు కనిపించకూడదనేదే ప్రధాన ఉద్దేశం. అయితే కొన్ని సందర్భాల్లో ఇది ఒక సమూహానికి చిహ్నంగానూ నడిచింది. బుర్ఖాలు వేసుకున్న మహిళలపై. వేరే సమూహాలు దాడి చేయకుండా ఒక హెచ్చరికగా దీన్ని పాటించారు. ఖురాన్‌లో దీని ప్రస్తావన చాలాచోట్ల కనిపిస్తుంది. స్త్రీలు గౌరవం కోసం శరీరభాగాలు కనిపించకుండా కప్పెట్టుకోవాలని అది చెబుతుంది. బయట తిరిగే మగ ప్రపంచం బారి నుంచి రక్షణ కోసం, గోప్యత కోసం దీన్ని పాటించాలని ముల్లాలు చెబుతుంటారు. కానీ అన్ని ముస్లిం దేశాల్లో బుర్ఖా లేదు. బుర్ఖా అంటే కళ్లు మినహా మనిషిని తల నుంచి కాళ్లవరకు పూర్తిగా కప్పే దుస్తు. స్థానిక సంప్రదాయాలను బట్టి కొందరు కేవలం ముఖానికే ధరిస్తుంటారు. కొందరు ఛాతీవరకు వేసుకుంటారు.
అనుమానం..
20 ఏళ్లుగా పలుదేశాల్లో ఉగ్రవాద దాడులు పెద్దసంఖ్యలో సాగుతున్నాయి. ప్రశాంతంగా ఉండే నార్వే, డెన్మార్క్, న్యూజిలాండ్, ఫ్రాన్స్ వంటి దేశాల్లోనూ ముష్కరులు పంజా విసురుతున్నారు. పోలీసులు తమను గుర్తుపట్టకుండా బుర్ఖాల్లో వచ్చి దాడి చేస్తున్నారు. మొన్న ఈస్టర్ రోజు శ్రీలంకలో ఓ మహిళా బాంబర్ అలాగే వచ్చి పేల్చేసుకుంది. బుర్ఖా వల్ల పేలుడు పదార్థాలు, తుపాకులు వంటి వాటిని గుర్తించడం, తనిఖీ చేయడం కష్టంగా మారుతోంది. దీంతో ప్రజల భద్రత కోసం ప్రభుత్వాలు దానిపై నిషేధాలు విధిస్తున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రియా, కెనడా, బెల్జియం, ఫ్రాన్స్ సహా 14 దేశాల్లో బుర్ఖాపై నిషేధం ఉంది. వీటితోపాటు చాలాదేశాల్లో పాక్షిక నిషేధం ఉంది. ఇళ్లలో బుర్ఖాలు వేసుకోవచ్చని, అయితే బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు అలా రాకూడదని, ముఖం వరకే ముసుగులు వేసుకోవాలని ఆంక్షలు ఉన్నాయి.
అది సంస్కృతికి చిహ్నం..
బుర్ఖాపై భయాలకు దాడులే కారణం. కానీ బుర్ఖా ఉన్న అన్ని దేశాల్లో దాడులు జరగడం లేదు. బుర్ఖా తమ సంస్కృతికి, మతాచారాలకు, స్వేచ్ఛకు ప్రతీక అని, దానిపై నిషేధం సరికాదని కొందరు ముస్లిం మహిళలు ఉద్యమాలు కూడా చేస్తున్నారు. తమ వస్త్రధారణ ఎలా ఉండాలో నిర్ణయంచే హక్కు ప్రభుత్వాలకు లేదని అంటున్నారు. హిందూమతం నుంచి ఇస్లాంలోకి మారిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూతుళ్లలో ఒకరు తాను స్వచ్ఛందంగానే బురఖా వేసుకుంటున్నానని చెబుతోంది. బుర్ఖా లింగ సమానత్వానికి చిహ్నమనే అతి వాదన కూడా ఉంది. ముస్లి దేశాల్లో స్ర్తీపురుషులు పొడవాటి దుస్తులు వేసుకోవడం వల్ల ఆడా, మగా తేడాలు ఉండవని, ఆడవాళ్ల అందచందాలు బయటికి కనిపించవు కనుక వాళ్లపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు సాగవని చెబుతుంటారు. అయితే బుర్ఖాలు ఉన్న దేశాల్లోనూ అత్యాచారాలు సాగుతున్నాయి. సౌదీ అరేబియా నుంచి పాకిస్తాన్ వరకు చిన్నపిల్లలను కూడా కామాంధులు కాటేస్తున్నారు. సౌదీ అరేబియాలో రేపిస్టులను బహిరంగంగా ఉరి తీస్తున్నారు. బుర్ఖాను నిషేధించాలనే ముస్లిలు కూడా పెద్దసంఖ్యలోనే ఉన్నారు. అది తమపై సౌదీ అరేబియా రుద్దుతన్న వ్యవహారమని, మారుతున్న కాలాన్ని బట్టి దాన్ని కూడా వదిలించుకోవాలని చెబుతున్నారు.
పరిష్కారం ఏంటి మరి?
ప్రజల ప్రాణాలకన్నా ఏ ఆచారమూ, దుస్తులూ ముఖ్యం కాదు. నిఘా వ్యవస్థ ఎంత బలంగా ఉన్నా, నేరస్తులు ఎదో రూపంలో పేట్రేగిపోతుంటారు. ఉగ్రవాదులు కేవలం బుర్ఖాలోనే కాకుండా సైనిక దుస్తుల్లో వచ్చి దాడులు చేస్తున్నారు. దీంతో బుర్ఖాను నిషేధిస్తే దాడులు జరగవనే గ్యారంటే లేదు. మధ్యేమార్గంగా గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం మినహా మరో దారి లేదు. ప్రతి మనిషీ ఇతరులకు భంగం కలిగించకుండా నడుచుకుంటే ఎవరికీ సమస్య ఉండదు. తనిఖీ చేయడానికి మహిళా సెక్యూరిటీ గార్డులను పెంచడం, బుర్ఖా మహిళల గౌరవానికి ఇబ్బంది కలగని చర్యలు తీసుకోవడం వంటి చర్యలు తీసుకోవాలి. ఏ మనిషీ పుట్టుకతో నేరస్తుడు కాదు. ఉగ్రవాదులైనా మరెవరైనా చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావంతో అలా తయారవుతారు. అలాంటి పరిస్థితుల నిర్మూలనకు కృషి చేస్తే బుర్ఖానే కాదు, ఏ దుస్తులూ ప్రమాదకరం కావు. అదే సమయంలో మానవ వస్త్రనాగరికత తరతరాలుగా ఎన్నో మార్పులు చెందుతూ వస్తోంది. మన దేశం సంగతే చూసుకుంటే ధోవతులు పోయి ప్యాంట్లు వచ్చేశాయి. ప్రజలకు ఏది సౌకర్యంగా ఉంటే అది మనుగడ సాగిస్తుంది!!