Home > Featured > ‘దళితుల వల్లే దరిద్రం’… నన్నపనేని రాజకుమారి అరెస్ట్.. 

‘దళితుల వల్లే దరిద్రం’… నన్నపనేని రాజకుమారి అరెస్ట్.. 

టీడీపీ నేతలు చేపట్టిన ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమం రసాభాసగా మారింది. నేతలు 144 సెక్షన్‌ను బేఖాతరు చేశారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమై చంద్రబాబు, లోకేశ్, కేశినేని నాని, భూమా అఖిలప్రియ, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరుల్ని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు, లోకేశ్‌లను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల వైఖరిపై మండిపడుతూ టీడీపీ నేత, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. అయితే పోలీసులు ఆమెను, పాయకరావు పేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో రాజకుమారి పోలీసులపై దుర్భాషలాడారని ఎస్సై అనురాధ ఆరోపిస్తున్నారు. ‘దళితుల వల్లనే ఈ దరిద్రం’ అంటూ విధుల్లో ఉన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు.

నన్నపనేని వ్యాఖ్యలతో తాను కలత చెందానని. ఎమ్మెల్యేగా, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా పనిచేసిన నన్నపనేని ఇలా మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం మాట్లాడుతున్నారు మీరు? మేం దళితులమా? పబ్లిక్ సర్వెంట్లం మేము. కష్టపడి మేము ఉద్యోగం సంపాదించుకున్నాం. మీలాగా కాదు. మీడియా మొత్తం చూస్తుండగా వేలు చూపిస్తారా?’ అంటూ అనురాధ నిప్పులు చెరిగారు. దీంతో అప్పటివరకూ ఉత్సాహంగా ఉన్న నన్నపనేని రాజకుమారి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అనంతరం అనురాధ మనస్తాపం చెంది విధుల నుంచి వెళ్లిపోయారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకురాళ్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. అంతే కాదు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా మహిళా ఎస్‌ఐతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులపై దుర్భాషలాడిన మరికొందరు నేతలపై కూడా కేసులు నమోదు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Updated : 11 Sep 2019 5:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top