Controversy over Rahul Gandhi's T-shirt
mictv telugu

రాహుల్ గాంధీ టీషర్ట్‌పై వివాదం.. కాంగ్రెస్, బీజేపీల మధ్య రగడ

September 10, 2022

Controversy over Rahul Gandhi's T-shirt

దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ కీలక నేత, ఆ పార్టీ ఎంపీ ‘భారత్ జోడో యాత్ర’ చేస్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగనున్న ఈ యాత్రలో రాహుల్ గాంధీతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు.

దారి పొడగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ వేసుకున్న టీ షర్ట్‌పై బీజేపీ స్పందించింది. ఆ టీషర్టును, ఆన్ లైన్లో దాని ధరను ట్వీట్ చేస్తూ ‘భారత్ దేఖో’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఒక్క టీషర్ట్ ధరనే రూ. 41,257 అంటూ పోస్ట్ చేసింది. దీనికి కాంగ్రెస్ కూడా ధీటుగానే బదులిచ్చింది. ప్రధాని మోదీ ధరించిన సూట్ ధరను గుర్తు చేసింది. మోదీ సూట్ ధర రూ. 10 లక్షలు, కళ్లజోడు ధర రూ. 1.50 లక్షల గురించి మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించింది. ‘భారత్ జోడో యాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి భయపడుతున్నారా? నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. దుస్తుల గురించి కాదు’ అంటూ కౌంటరిచ్చింది. కాగా, రాహుల్ గాంధీ రోజుకు సుమారు 10 నుంచి 12 కిలోమీటర్ల వరకు నడక సాగిస్తున్నారు.