ఏపీ ఆర్ధిక రాజధాని విశాఖపట్టణంలో మత్స్యకారుల మధ్య మరోసారి రింగు వలలు వివాదం సృష్టించాయి. శుక్రవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు రింగువలలతో కూడిన ఆరు పడవలకు నిప్పు పెట్టారు. దీన్ని గుర్తించిన వాసవానిపాలెం, జాలరి ఎండాడకు చెందిన మత్స్యకారులు మంటలను ఆర్పేశారు. అయితే ఈ పని పెద్దజాలరిపేటకు చెందిన మత్స్యకారులే చేశారనే అనుమానంతో వారికి చెందిన మూడు మర పడవలను వాసవానిపాలేనికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో రెండు గ్రామాల మధ్య వివాదం రాజుకోగా, పోలీసులు రంగప్రవేశం చేశారు. అటు మత్స్యశాఖ అధికారులు కూడా గ్రామానికి చేరుకొని సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. అయితే రింగు వలల సమస్యను అధికారులు కావాలనే పరిష్కరించడంలేదనే ఆరోపణతో గ్రామస్థులు అధికారులు, పోలీసులపై తిరగబడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఐదు చోట్ల పికెటింగ్లను ఏర్పాటు చేశారు. పరిస్థితి కాస్తంత సద్దుమణగడంతో గ్రామ పెద్దలతో పోలీసులు, మత్స్యశాఖ అధికారులు చర్చలు జరుపుతున్నారు.