Controversy over the name of 'Neera Cafe' in Hyderabad
mictv telugu

హైదరాబాద్‎లో ‘నీరాకేఫ్‌’పేరుపై వివాదం…బ్రాహ్మణ సంఘం మండిపాటు

January 10, 2023

Controversy over the name of 'Neera Cafe' in Hyderabad

హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ‘నీరాకేఫ్‌’పేరుపై వివాదం రాజుకుంది. నీరా కేఫ్‌‎కు ‘వేదామృతం’ అని పేరు పెట్టడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వేదాలను కించపరిచేలా కల్లు కాంపౌండ్‌కి వేదామృతం పేరు పెట్టడాన్ని తప్పుబడుతున్నారు. ఎక్సైజ్ శాఖ ఆ వెంటనే పేరును మార్చాలంటూ బ్రాహ్మణ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు కేవి రమణాచారికి వినతిపత్రం అందజేశారు. పేరు మార్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ వివాదంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. వేదామృతం అనే పదంపై ఏమైనా వివాదం ఉంటే పరిశీలిస్తామని మంత్రి ఇచ్చారు. వీటిని ప్రకృతి ఔషధాలుగా వేదాలు వివరించాయని అందుకే వేదామృతం పేరు పెట్టినట్లు తెలిపారు. అదే విధంగా ‘వేదాలు రాసింది ఒక బెస్త, రామాయణం రాసింది ఒక బోయ.. వేదాలను కులాల రహితంగా చూడాల్సిన అవసరం ఉంది. పీహెచ్‌డీ చేసిన కొంతమంది విద్యార్థులు వేదాలను అధ్యయనం చేసి.. వేదామృతం అనే పేరును సూచించారు.’ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు.

రూ.13 కోట్ల వ్యయంతో హుస్సేన్‌సాగర్ తీరాన ‘నీరాకేఫ్‌’త్వరలోనే అందుబాటులోకి రానుంది. తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన స్వచ్ఛమైన నీరాను ప్రాసెస్ చేసి ఈ కేఫ్‌లో అమ్మనున్నారు. ఏక కాలంలో సుమారు 300 నుంచి 500 మంది వరకు కూర్చునే విధంగా.. ఏర్పాట్లు చేశారు.. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్న నీరాకేఫ్‌లో పల్లె వాతావారణం కనిపించేలా తీర్చిదిద్దారు. తాటి, ఈత మొద్దుల నమూనాల్లో కూర్చొనే విధంగా ఏర్పాట్లు చేశారు. కేఫ్ చుట్టూ తాటి చెట్లు.. వాటికి మట్టి కుండలు కట్టి.. అచ్చం గ్రామీణ వాతావరణాన్ని సృష్టించారు. ఈ కేఫ్ పైకప్పును కూడా తాటి ఆకు ఆకారంలో డిజైన్ చేశారు. ఇక నీరా తాగుతూ హుస్సేన్‌సాగర్ అందాలను వీక్షించే అవకాశం ఉంది.