కర్ణాటకలో మరో వివాదం.. మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై హెచ్చరిక - MicTv.in - Telugu News
mictv telugu

కర్ణాటకలో మరో వివాదం.. మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై హెచ్చరిక

April 5, 2022

bbb

వరుస వివాదాలకు కర్ణాటక రాష్ట్రం కేంద్ర బిందువైతోంది. ఈ మధ్యనే హిజాబ్, దేవాలయాల వద్ద ముస్లిం దుకాణాల తొలగింపులతో దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్న కర్ణాటకలో తాజాగా మసీదుల్లో లౌడ్ స్పీకర్ల అంశం రాజుకుంది. మసీదుల్లో ముస్లింలు రోజూ ఐదు సార్లు చేసే నమాజును మైకుల ద్వారా ప్రసారం చేయడం మనకు తెలిసిన విషయమే. అయితే చిన్నారులకు, వృద్ధులకు ఇబ్బందులు కలుగుతోందన్న నేపథ్యంలో గతంలో సుప్రీం కోర్టు లౌడ్ స్పీకర్లపై కొన్ని చర్యలకు ఆదేశించింది. రాత్రి 10 నుంచి ఉదయం ఆరు వరకు లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిషేధించింది. తాజాగా ఈ అంశాన్ని భజరంగ్ దళ్, శ్రీరామసేన వంటి సంస్థలు చర్చకు తీసుకొచ్చాయి. మసీదుల్లో మైకులను నిలిపివేయకపోతే ఉదయమే మేము కూడా మైకుల ద్వారా ఆధ్యాత్మిక ప్రసంగాలను వినిపిస్తామని హెచ్చరించాయి. శ్రీరామ సేన అధ్యక్షుడు ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘మసీదుల్లో ప్రార్థనలకు మేం వ్యతిరేకం కాదు. మైకుల వినియోగాన్నే వ్యతిరేకిస్తున్నాం. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని మేం కోరుతున్నా’మని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి ఈశ్వరప్ప స్పందిస్తూ ముస్లిం వర్గాలు ఈ విషయంపై పునరాలోచించాలని కోరారు. మైకులను వినియోగించడం వల్ల విద్యార్థులకు, చిన్నారులకు, వద్ధులకు ఇబ్బందిగా ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, ఇటీవలే మహారాష్ట్రలో నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే కూడా ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.