Controversy With Arjun Sarja and Hero Vishwak Sen Reacts
mictv telugu

అర్జున్ Vs విశ్వక్: కళ్లు మూసుకుని కాపురం చేయ్ అన్నట్లుంది

November 7, 2022

సీనియర్ నటుడు అర్జున్, యంగ్ హీరో విశ్వక్ సేన్‌ల మధ్య వివాదం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అర్జున్‌ కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా ఆయన నిర్మాణ సారథ్యంలో ఓ సినిమాకు హీరోగా విశ్వక్‌సేన్‌ సైన్‌ చేశారు. స్టోరీ, రెమ్యునరేషన్‌పై అగ్రిమెంట్‌ చేశాక చివరి నిమిషంలో షూటింగ్‌కు రానంటూ సడెన్‌గా విశ్వక్ సేన్ మెసేజ్‌ పెట్టాడని అర్జున్ ఆరోపణ. ప్రెస్‌మీట్ పెట్టి మరీ విశ్వక్‌ సేన్‌కి నటుడిగా కమిట్‌మెంట్ లేదంటూ విమర్శలు గుప్పించాడు. విషయం మీడియాకి తెలియడంతో.. అసలు అలా సినిమా షూటింగ్‌ని ఎందుకో ఆపేయాల్సి వచ్చిందనేదానిపై వివరణ ఇచ్చాడు విశ్వక్ సేన్.

‘రాజయోగం’ అనే సినిమా టీజర్‌ విడుదలకు గెస్ట్‌గా హాజరైన విశ్వక్‌.. వేదికపైనే తనంతటి ప్రొఫెషనల్‌ నటుడు లేరని, అలాంటి తనకు కమిట్‌మెంట్‌ లేదని ఒక్క లైట్‌బాయ్‌ చెప్పినా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానని చెప్పాడు. అన్ని సినిమాల్లానే అర్జున్‌గారి చిత్రానికీ అదే అనుకుని ప్రారంభించాని కానీ అక్కడ వర్కవుట్ కాలేదన్నారు. అర్జున్ సర్ తీయబోయే సినిమాలో ‘నేను ఫలానా మార్పు చేస్తే బాగుంటుంది సర్‌’ అని చెబితే.. వదిలేయమనే వారని, ఏం చెప్పనిచ్చేవారు కాదని అన్నారు. ఆయనతో చేసే పని కళ్లుమూసుకుని కాపురం చేసేయ్‌ అన్నట్టుందని, ఏ సినిమాకీ ఇలా అనిపించలేదన్నారు. ఒక్కరోజు షూటింగ్‌ రద్దు చేస్తే.. కొన్ని విషయాలు చర్చించుకుందామని మేసేజ్‌ పెట్టానని, మా మేనేజరు ఎన్నిసార్లు అడిగినా ఆయన నుంచి సమాధానం లేదన్నారు.

‘‘షూటింగ్ ప్రారంభానికి ముందు నేను క్యాన్సిల్‌ చేయటం తప్పే. కానీ, నాలుగు రోజులు అయిష్టంగా పనిచేసి తర్వాత కొన్ని రోజులు బ్రేక్‌ తీసుకోవాలనుకోవటం ఇంకా పెద్ద తప్పు. సినిమాల విషయంలో తప్పు చేశానంటే చెప్పండి.. ఇప్పుడే పరిశ్రమ నుంచి వెళ్లిపోతా. నా వల్ల మీకు ఇబ్బంది పడి ఉంటే క్షమించండి సర్‌’’ అని విశ్వక్‌ సేన్‌ అర్జున్‌ను ఉద్దేశించి మాట్లాడారు.